గుంటూరోడు చాలా ఘాటు గురూ... రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 3 మార్చి 2017 (22:31 IST)
నటీనటులు: మంచు మనోజ్‌, ప్రగ్యా జైస్వాల్‌ తదితరులు; సంగీతం : డీజే వసంత్‌, నిర్మాతలు: శ్రీ వరుణ్‌ అట్లూరి, దర్శకత్వం : ఎస్కె సత్య.
 
మంచు మనోజ్‌ విజయాల కోసం చాలా కష్టపడుతున్నాడు. కానీ హిట్‌ కొట్టడం కష్టమైపోతుంది. ఈసారి ఖచ్చితమైన హిట్‌ అందుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. మనోజ్‌ను తాము ఎలా చూడాలనుకున్నామో అలా దర్శకుడు చూపించాడని మెచ్చుకున్న మంచు కుటుంబం.. మరి వారు ఆశించినస్థాయిలో వుందో లేదో చూద్దాం.
 
కథ :
గుంటూరు పట్టణంలో కన్నా(మంచు మనోజ్‌) కుర్రాడు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకునే టైప్‌. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయడమే తన పని. అలాంటివాడు ఓసారి క్రిమినల్‌ లాయర్‌ శేషు(సంపత్‌)తో గొడవపడే స్థితి వస్తుంది. దానివల్ల శేషును తీవ్రంగా కన్నా కొట్టేస్తాడు. అందరిముందు జరిగిన ఈ గొడవతో అవమానంతో రగిలిపోయిన శేషు.. కన్నా తండ్రి(రాజేంద్ర ప్రసాద్‌)ని టార్గెట్‌ చేస్తాడు. ఇక మరోవైపు శేషు చెల్లెలు అమత(ప్రగ్యా జైస్వాల్‌)ను కన్నా ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన శేషు.. ఊరుకుంటాడా.. కన్నాపై రివెంజ్‌పై రగిలిపోతాడు. ఆ సమయంలో కన్నా వేసిన ప్లాన్‌ ఏమిటి? రాజేంద్రప్రసాద్‌ ఏమయ్యాడు. అమృత లవ్‌ సక్సెస్‌ అయిందా లేదా? అనేది సినిమా.
 
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ బాగుంది. గుంటూరు టైటిల్‌ కాబట్టి.. ఆ పరిసర ప్రాంతాల్ని చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలు చాలా బాగా రూపొందించారు. మనోజ్‌ బాడీ లాంగ్వేజ్‌‌కు తగ్గట్టు డిజైన్‌ చేశారు. కమెడియన్‌ పృథ్వి కామెడీ ట్రాక్‌ రొటీన్‌గా వుంది. డీజే వసంత్‌ సంగీతం ఫర్వాలేదనిపించినా బ్యాక్‌‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇంకాస్త బాగా ఇచ్చి ఉండాల్సింది. ఇక దర్శకుడు సత్య విషయానికొస్తే అతని ఫర్వాలదనే పనితనం చూపాడు. హీరో విలన్ల మధ్య ఉండే ఘర్షణ సన్నివేశాల్ని బాగా రాసుకున్నాడు. కానీ సినిమా కథనంలో కాస్త ఎంటర్టైన్మెంట్‌ యాడ్‌ చేసి ఉండాల్సింది.
 
విశ్లేషణ :
కథకు సరిపడా ఫిజిక్‌తో హీరో వున్నాడు. టైటిల్‌ పాత్రకు తను సరిపోయాడు. స్వతహాగా ఫైట్స్‌ తెలిసిన మనోజ్‌ బాగానే చేశాడు. బాడీ లాంగ్వేజ్‌, పవర్‌‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం చాలా బాగున్నాయి. అయితే తెలుగులో మాస్‌ హీరో అనిపించుకోవాలనుకున్న యువ హీరోలు క్రూయల్‌ మైండ్‌ వుండే పెద్ద విలన్‌ను ఎదిరించడం తేలిపోవడం జరుగుతుంది. ఈ చిత్రంలోనూ సంపత్‌తో పోటీ పడే సన్నివేశాల్లో మనోజ్‌ ఎక్కువగా అరిచినా.. శ్రుతిమించినట్లుగా అనిపిస్తుంది. 
 
దర్శకుడు హీరోపాటు ధీటుగా వుండే విలన్‌ పాత్రను డిజైన్‌ చేసుకున్నాడు. చిన్నచిన్న విషయాల్లో అతను ఇగో ప్రదర్శించే తీరును బాగా చూపించారు. అతని పాత్ర వలన సినిమా ఫస్టాఫ్‌ మొత్తం చాలా బలంగా తయారైంది. అలాగే చాలాకాలం తర్వాత నెగెటివ్‌ రోల్‌ చేసిన కోట శ్రీనివాసరావు పాత్ర బాగుంది. ప్రగ్యాజైశ్వాల్‌ అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కాస్త ఆసక్తికరంగానే ఉంది. ప్రీ-క్లైమాక్స్‌ ఎపిసోడ్‌లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించింది.
 
ఇక మాస్‌ చిత్రం కనుక ఏది చూపించినా నడిచిపోతుంది. దానివల్ల యాక్షన్‌, డైలాగ్స్‌పై పెట్టిన శ్రద్ధ ఎంటర్‌టైన్‌మెంట్‌పై చూపలేదు. దీంతో సీరియస్‌గానే సినిమా సాగుతుంది. ఇంకా.. హీరోహీరోయిన్ల మధ్య కూడా చెప్పుకోదగ్గ రొమాంటిక్‌ పెద్దగా పండలేదు. దానికితోడు రావు రమేష్‌ మంత్రిగా ఎంట్రీ ఇచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించేయడం మరీ సిల్లీగా చూపించాడు. ప్రధాన లోపం ఏమంటే.. హీరో.. ముఖకవళికలు.. మాడ్యులేషన్‌.. ఇంకాస్త మెరుగుపర్చుకుంటే బాగుండేది. తను ముద్దముద్దగా పలికే డైలాగ్‌లు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోలేకపోయాయి. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, మిగిలిన కొన్ని అనవసరపు సన్నివేశాలు కథనానికి అడ్డు తగలడంతో కాస్త బోరింగ్‌ ఫీల్‌ ఆవహించింది.
 
పూర్తిగా మాస్‌ ప్రేక్షకులను దష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. హీరో, ప్రతినాయకుడుపై పెట్టిన ఎపిసోడ్స్‌ ఇందులో ప్లస్‌ పాయింట్స్‌ కాగా బోరింగ్‌ సన్నివేశాల వలన అసలు కథ పక్కదారి పట్టడం మైనస్‌ పాయింట్స్‌‌గా ఉన్నాయి. యాక్షన్‌ చిత్రాలు చూసే మాస్‌ ప్రేక్షకుల్ని మాత్రమే ఆకట్టుకుంటుంది. పూర్తిస్థాయి ప్రేక్షకుల చిత్రాన్ని దర్శకుడు తీయలేకపోయాడు.
 
రేటింగ్‌: 2.5/5

వెబ్దునియా పై చదవండి