తెలుగులో బిచ్చగాడు విడుదల చేసిన చదలవాడ శ్రీనివాస్ కుమారుడు లక్ష్ చదలవాడ. హీరోగా వలయం, గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. తాజాగా ధీర అనే సినిమా చేశారు. నేహా పఠాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు ప్రత్యేకంగా కేర్ తీసుకుని విడుదలచేసిన ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
కథ:
వైజాగ్‌కు చెందిన రణ్‌ధీర్(లక్ష్ చదలవాడ) మెకానిక్. డబ్బు సంపాదనే థ్యేయంగా పెట్టుకుంటాడు. దానికోసం దేనికైనా తెగిస్తాడు. అలాంటి రణదీర్ కు వైజాగ్ లోకి ప్రముఖ ఆసుపత్రి నుంచి కాల్ రావడంతో తను డ్రైవర్ గా మారి అంబులెన్స్ లో రాజ్‌గురు అనే పొలిటికల్ ఎనలిస్ట్ పేషెంట్‌ని హైదరాబాద్ తీసుకెళతాడు. అందుకు పాతిక లక్షలు ముట్టచెబుతారు. ఇక పేషెంట్ ను చూసుకోవడానికి డాక్టర్ అమృత(నేహా పఠాన్), తోడుగా మరో డాక్టర్ (మిర్చి కిరణ్) వుంటారు. ఈ జర్నీలో రణ్‌ధీర్‌పై ఓ ముఠా దాడికి ప్రయత్నిస్తుంది.
ఇదిలా వుండగా, ఏపీ రాష్ట్ర సి.ఎం. పి.ఎ. హంసలేఖ దేవి(హిమజ) ఓ పాపను ప్రాణాలతో తీసుకురావాలంటూ నమ్మకస్తుడైన పోలీసు అధికారి(భరణి శంకర్)ని పంపిస్తుంది. ఆ పాపకు రాజగురుకు లింకేమిటి? అసలు రాజ్‌గురు ఏ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు? పాప కోసం రణ్‌ధీర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అమృత, మనీషా(సోనియా బన్సాల్)లతో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష
ఈ చిత్ర కథ చాలా పెద్దది. ఒకవైపు రాజకీయ కోణంలోనూ, మరోవైపు మెడికల్ మాఫియా అంశాలను ముడివేస్తూ దర్శకుడు కథ రాసుకున్నాడు. మద్యలో లవ్ స్టోరీ యాడ్ చేశాడు. అందులోకూడా హీరో చెప్పే రెండు కథలు కథను సాగదీస్తాయి. అయితే దర్శకుడు రాసిన కథను చాలా పవర్ ఫుల్ గా వున్నా, దాన్ని నెరేట్ చేయడంలో కొంచెం గాడి తప్పినట్లు కనిపిస్తుంది. హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తుకు తెస్తాయి. రాజ్‌గురు ఎవరు అనేది సస్పెన్స్ తో దర్శకుడు మురిపించాడు.
వైజాగ్ టు హైదరాబాద్‌కు అంబులెన్స్ జర్నీలో లవ్ స్టోరీ, యాక్సన్ ఎపిసోడ్స్ చూపించాడు. ఆసక్తికరంగా కథ ప్రారంభం అవుతుంది. మీనాక్షితో రణ్‌ధీర్ లవ్‌స్టోరీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. హీరో లవ్‌స్టోరీలోని ట్విస్ట్ రివీల్ అయ్యాక మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓ భారీ యాక్షన్.. రొమాంటిక్ సీన్స్ ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో ఒక్కో ట్విస్టు రివీల్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని నడించాడు. పాప ఎవరు? ఆమె కోసం వెతుకుతున్నదెవరు అనేది తెలుసుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది.
యంగ్ హీరో లక్ష్య్ గత సినిమాలలాగే తన టాలెంట్ ను యాక్షన్ సీన్స్ లో పడిన తపన కనిపిస్తుంది. ఈ సినిమాలో పాత్రలో వేరియష్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో తనదైన శైలిలో నటించాడు. డాక్టర్ అమృతగా నేహా పఠాన్, మనీషాగా సోనియా బన్సాల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. మిర్చి కిరణ్ కామెడీ సినిమాకు ప్లస్ అయింది. భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక పరంగా సాయి కార్తీక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్సాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చిన్నపాటి లోపాలున్న ఈ చిత్రం యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ధీర నచ్చుతుంది.