సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫర్ : స్వామి ఆర్. ఎం., సంగీతం : యాదగిరి వరికుప్పల, నిర్మాతలు : అభయ్ అడకా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జై రాజసింగ్
సినిమా అనగానే వినోదమే కాదు విజ్ఞానం కూడా వుండే చిత్రాలు బహు అరుదు. అది ఎలాంటి హీరో, దర్శకుడు అనేది పక్కన పెడితే విజ్ఞానం కల్గించే చిత్రాలు సమాజానికి మేలు చేస్తాయి. అటువంటి కోవలోనిది 'మార్షల్. కొత్త దర్శకుడు జై రాజాసింగ్, కొత్త హీరో అభయ్, హీరోయిన్ మేఘా చౌదరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మార్షల్'. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్లోనే నిర్మించారు. 'కె.జి.ఎఫ్' మ్యూజిక్ ఫేమ్ రవి బసురి రీ-రికార్డింగ్ అందించిన ఈ సినిమా శుక్రవారమే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
శివాజీ (శ్రీకాంత్) సూపర్ స్టార్ వారసుడు. తండ్రి మరణానంతరం వారసత్వంగా హీరోయిజం వచ్చేస్తుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటూంది. శివాజీకున్న పిచ్చి అభిమానుల్లో ఒకడు అభి (అభయ్). మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేస్తున్న అతని త్వరగా మేనేజర్‌స్థాయికి ఎదుగుతాడు. ఆ హోదాలో అతను ఇచ్చిన బ్యూటీపిల్స్ (టాబ్లెట్స్) వల్ల కొందరు ఆడపిల్లలు అనారోగ్యంకావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇతని తండ్రి పోలీసు. అయినా ఏమీ చేయలేని స్థితి. అయితే పై అధికారి ఈ కేసును అతని తండ్రికే అప్పగిస్తాడు. ఆ కోణంలో ప్రముఖ వ్యక్తి వున్నాడని రూఢీ అయ్యాక. అతన్ని టార్గెట్ చేస్తారు తండ్రీ కొడుకులు. అతనే సూపర్‌స్టార్ శివాజీ. ఇంతకీ శివాజీ ఏం చేశాడు? అతన్ని ఎవరైనా కావాలని ఇరికించారా? అనేవి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ చిత్ర కథ వర్తమానానికి చెందిందనే చెప్పాలి. దేశంలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దందానే. మెడిసిన్స్ మాఫిపై పలు చిత్రాలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో టచ్ చేసిన పాయింట్ చాలా కొత్తగా వుంది. లాజిక్‌గాకూడా వుంది. ఇటువంటి పెద్ద కాన్సెప్ట్‌ను డీల్ చేసిన దర్శక నిర్మాతల్ని అభినందించాల్సిందే. దేశంలో పెద్ద పెద్ద పట్టణాల్లో జరిగే విషయాలను, వార్తల్లో చదివిన విషయాలే ఇందులో కన్పిస్తాయి. పిల్లలు పుట్టకపోతే సరోగసి ద్వారా చేసే క్రమంలో జరిగే మోసాలు కళ్ళకు కట్టిన్లు చూపించాడు.
పిల్లలు పుట్టనివారికి అండాన్ని రీప్రొడ్యూస్ విధానమే 'మార్షల్' ప్రాజెక్ట్. దాన్ని ప్రజల్లో పేరు మోసిన ఓ వ్యక్తి వుంటే అతన్ని ఏవిధంగా అడ్డు కట్టవేశాడనేది చిత్రంలో ప్రధాన పాయింట్. ఈ మార్షల్ ప్రాజెక్ట్‌కోసం అమాయకులైన టీనేజ్ వారిని ఎలా ఎట్రాక్ట్ చేస్తారనేది గగుర్పాటుకు గురిచేస్తుంది. ఒక దశలో కార్పొరేట్ ఆసుపత్రులంటే భయం కల్గించేవిధంగానూ ఈ కథ వుంది. మరోవైపు ప్రతి ఒక్కరూ ఆలోచించేలా కన్పిస్తుంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలాగే మెడికల్ సిస్టమ్ కి సంబంధించిన సీన్స్ అండ్ మార్షల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సీన్స్, మదర్ సెంటిమెంట్ చివరిగా సినిమాలో ఉన్న మంచి మెసేజ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. శ్రీకాంత్, అభయ్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. సినిమాలో శివాజీ అనే కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ చక్కని నటనను కనబరిచాడు.
స్టయిలిష్ నటనతో ఆకట్టుకున్నాడు. హీరోగా పరిచయమైన అభయ్ తన పాత్రకు తగ్గట్టు చేశాడు. గెడ్డంకంటే ఫుల్‌షేవ్‌లో వున్నప్పుడే ఇంట్రెస్ట్‌గా అనిపించాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ కథ ప్రకారం వున్నవే. ఎక్కడా మోతాదు మించలేదు. అభయ్ డాన్స్‌పరంగా ఓకే. మేఘా చౌదరి గ్లామర్ పరంగానే కాకుండా తన నటనతోనూ మెప్పించింది. ప్రధానంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌తోపాటు క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి.
ఇంత కొత్త కథకు భారీ తనానికి కొత్త దర్శకుడు కావడంతో భారంగానే అనిపించింది. స్లో నెరేషన్‌తోపాటు మరింత చక్కగా స్క్రీన్‌ప్లే ప్రెజెంట్స్ చేస్తే చిత్రం స్థాయి మరింత పెరిగేది. ముఖ్యంగా కోర్టుసీన్‌లో హీరో ఫెరోషియస్‌గా డైలాగ్స్ చెబితే మరింత ఎట్రాక్ట్‌గా వుండేది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేకపోయారు.
టెక్నికల్‌గా కెమెరామెన్, సంగీత దర్శకుడు పనితనం సూటయ్యాయి. స్వామి ఆర్ యమ్ అందించిన సినిమాటోగ్రపీ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. యాదగిరి వరికుప్పల అందించిన సంగీతం పర్వాలేదు.'కె జి ఎఫ్' మ్యూజిక్ ఫేమ్ రవి బసురి అందించిన రీ-రికార్డింగ్ చిత్రానికి ఆకర్షణగా నిలిచింది. లిమిటెడ్ బడ్జెట్‌లో నిర్మించిన ఈ చిత్రం మంచి క్వాలిటీతో తెరకెక్కింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. వైవిద్యభరితమైన చిత్రంగా ఈ మార్షల్‌లో మంచి మెసేజ్ ఉంది.
అలాగే వైద్య వ్యవస్థలోని చీకటి కోణాల్ని ఈ చిత్రం బాగా చూపెట్టింది. ముఖ్యంగా శ్రీకాంత్ పాత్ర, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఇన్సిడెంట్స్ అలాగే మార్షల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ కథాకథనాల్లో మరింత ఆసక్తికరంగా చూపించితే చిత్రం పెద్ద స్థాయిలో వుండేది. టోటల్‌గా చక్కటి పాయింట్‌ను ఆలోజింపచేసే విధంగా వుందని చెప్పాలి.