ప్రేమలో పడ్డా ఫలితం లేదు... 'పడ్డానండి ప్రేమలో మరి' రివ్యూ రిపోర్ట్

శనివారం, 14 ఫిబ్రవరి 2015 (18:54 IST)
పడ్డానండి ప్రేమలో మరి చిత్రం నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు, అరవింద్‌, పీలా గంగాధర్‌, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి తదితరులు. సాంకేతిక సిబ్బంది : కెమెరా: భరణి కె. ధరన్‌, సంగీతం: ఎ.ఆర్‌.ఖుద్దూస్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, సమర్పణ: నల్లపాటి వంశీమోహన్‌, నిర్మాత: నల్లపాటి రామచంద్రప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉప్పుటూరి మహేష్‌.
 
విడుదల : శుక్రవారం, వాలెంటైన్‌ డే.. 14.2.2015
 
హ్యాపీడేస్‌ తర్వాత కొత్తబంగారు లోకం వంటి గుర్తింపు పొందిన చిత్రాల్లో నటించిన వరుణ్‌ సందేశ్‌కు ఆ తర్వాత చిత్రాలు విజయం, అందని ద్రాక్షపండులా తయారైంది. అయినా పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. భారీగా ఖర్చుపెట్టి తీస్తున్నా ఎందుకనో ఆయన చిత్రాలు ఆదరణ పొందలేకపోతున్నాయి. కానీ, ఈసారి పక్కా మాస్‌ తరహాలో 'పడ్డానండి ప్రేమలో మరి' అంటూ తీసిన చిత్రంపై మంచి నమ్మకంతో వున్నాడు. దర్శకుడు కూడా కొత్తవాడు కావడంతో అతనిలో ప్రతిభనంతా పెట్టాడు. మరి ఆ చిత్రం వాలేంటేన్స్‌ డే నాడు విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.

 
కథ : రామారావు ఉరఫ్‌ రామ్‌ (వరుణ్‌ సందేశ్‌) తన ఫ్రెండ్‌కు ప్రేమించిన అమ్మాయితో పెండ్లి చేయడానికి కంకణం కట్టుకుంటాడు. ఎలాగూ రామ్‌ తల్లిదండ్రులు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో రామ్‌ చేసే పనికి సపోర్ట్‌ చేస్తారు. పైగా ఆ అమ్మాయి తండ్రి యాదవ్‌(పోసాని కృస్ణముళి) దగ్గరకు వెళ్ళి ఒప్పించాలని ట్రై చేస్తారు. కానీ రివర్స్‌ అవుతుంది. రామ్‌ లెక్క ప్రకారం ఫ్రెండ్‌ ప్రేమించిన అమ్మాయిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీక స్నేహితుడు చెప్పినట్లు విజయవాడకు బయలుదేరతాడు. ముందు రామ్‌ అంగీకరించకపోయినా బలవంతంగా అటువైపు కారు పోనిస్తాడు. 
 
అప్పుడు రామ్‌కు ఓ ప్లాష్‌బ్యాక్‌ వుంటుంది. విజయవాడలో శ్రావణి(వితిక షేరు)ని ఫస్ట్‌ సైట్‌లోనే లవ్‌ చేస్తాడు రామ్‌. ఎన్నో ట్విస్టుల తర్వాత వారిద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడతారు. విలన్‌ లంకపతి కూడా ఫస్ట్‌సైట్‌లోనే శ్రావణిని లవ్‌ చేస్తాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని డిసైడ్‌ అవుతాడు. ఆమెను కిడ్నాప్‌ చెయ్యాలని ట్రై చేస్తాడు. లంకపతి బారి నుంచి శ్రావణిని కాపాడతాడు రామ్‌. ఆ తర్వాత రామ్‌ను తన తండ్రికి పరిచయం చేయాలనకున్న శ్రావణి, రామ్‌ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అసహ్యించుకుంటుంది. ఆ కోపంతో అమెరికా లోని తన బావను పెండ్లి చేసుకుని చెక్కేయాలని చూస్తుంది.  అనుకోకుండా రామ్‌.. శ్రావణి పెండ్లికి వస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌ 
వరుణ్‌ సందేశ్‌ మాస్‌ తరహా చిత్రానికి ట్రై చేశాడు. లవ్‌తో పాటు యాక్షన్‌ కూడా మిక్స్‌ అయి, కొన్ని ట్విస్టులు మిక్స్‌ అయిన సినిమా. హీరోయిన్‌ రుతిక షేరు గ్లామర్‌గా వుంది. ఇప్పటి హీరోయిన్ల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా చేస్తారో అలా చేసేసింది. ఏడ్చే సన్నివేశం కృతకంగా అనిపిస్తుంది. పోసాని గత తరహా పాత్రనే పోషించాడు. అయితే చూపించే విధానం కొత్తగా వుంది. తాగుబోతు రమేష్‌ పాత్ర కామెడీకి పెట్టినా పెద్దగా ఎట్రాక్ట్ కాలేకపోయింది. ఎం.ఎస్‌. నారాయణ, తెలంగాణ శకుంతల ఇద్దరినీ ఒకసారి చూసుకోవడానికి బాగుంది.
 
టెక్నికల్‌గా... 
భరణి కె. ధరన్‌ ఫోటోగ్రఫీ బాగుందని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్‌ని డిఫరెంట్‌గా తీసే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్‌ విషయానికి వస్తే పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం పెద్ద సినిమాల రేంజ్‌లోనే వుంది. డైరెక్టర్‌ మహేష్‌ కొత్తయినా టేకింగ్‌ సీనియర్స్‌ లాగానే చేశాడు. కథలో వచ్చే ట్విస్ట్‌లను గానీ, సస్పెన్స్‌ని గానీ బాగానే మెయిన్‌‌టెయిన్‌ చేశాడు. ఫైట్‌మాస్టర్‌ రవి కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ కూడా బాగున్నాయి. గతంలో చిన్నచిన్న క్యారెక్టర్స్‌ చేసినప్పటికీ ఈ చిత్రంతో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ విలన్‌గా మారిన అరవింద్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు.
 
విశ్లేషణ :  
కథ మొదట్లోనే లవ్‌ చేజింగ్‌ అని అర్థమయిపోతుంది. మధ్యలో హీరో లవ్‌ ట్రాక్‌తో మొదటి భాగమంతా లాగించేస్తాడు. సెకండాఫ్‌లో రకరకాల ట్విస్ట్‌లతో కథనాన్ని సాగదీశాడు. అయితే పెద్ద ఆర్టిస్టుల మధ్య వరుణ్‌ సందేశ్‌ తేలిపోయాడనే చెప్పాలి. యాక్షన్‌ సీన్స్‌లోనూ లవ్‌ సీన్స్‌లోనూ అటువారిదే పైచేయిగా వుంది. ఈ తరహా ప్రేమకథా చిత్రాలు గతంలో చాలా వచ్చినప్పటికీ కొన్ని సీన్స్‌ ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తాయి. కథ, స్క్రీన్‌ప్లే, ఫ్లో గురించి పక్కన పెడితే టేకింగ్‌ పరంగా మహేష్‌ మంచి మార్కులు కొట్టేసాడు. నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. 
 
వాలెంటైన్‌ డే సందర్భంగా లవ్‌ సినిమాలు వస్తున్న తరుణంలో కొత్తగా చేయాలనే తపన దర్శకుడిలో కన్పించింది. అయితే ఈ కథకు హీరోగా ఎట్రాక్ట్‌ వున్నవారిని తీసుకుంటే సినిమా వేరేగా వుండేది. అయితే తొలిసారిగా తన సినిమాను ఓవర్‌సీస్‌లోనూ విడుదల చేసి సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న వరుణ్‌ సందేశ్‌కు గత చిత్రాల కంటే బెటర్‌ చిత్రమని చెప్పవచ్చు. మొత్తంగా ఆయన స్టేటస్‌కు ఏవరేజ్ సినిమా అనుకోవచ్చు.
 
రేటింగ్‌: 2/5 

వెబ్దునియా పై చదవండి