బస్తీబాలరాజు కేరెక్టర్‌లో తాను నటించాననీ, అది అందరికీ కనెక్ట్ అవుతుందనీ, ఇకపై ఆర్ ఎక్స్ 100 హీరో అని కాకుండా బాలరాజు పేరుతోనే ఫేమస్ అవుతానని వెల్లడించాడు కార్తికేయ. బన్నీవాసు నిర్మాత, అల్లుఅరవింద్ సమర్పణతో ఈ చిత్రం టైటిల్‌తోనే వెరైటీగా వున్న చావుకబురు చల్లగా.. ఈరోజే విడుదలైంది ఎలా వుందో చూద్దాం.
కథ:
వైజాగ్‌లోని అదో బస్తీ. స్వర్గపురి ఎసి.బండి నడిపే డ్రైవర్ బాలరాజు (కార్తికేయ). ఎక్కడ శవాలువున్న అక్కడికి వెళ్ళి స్మశానం వరకు తీసుకెళతాడు. దానికి తగినట్లు మొరటోడు. ఓ క్రీస్టియన్ ఇంటిలో ఎవరో చనిపోతే వెళతాడు. అక్కడ తన భర్త చనిపోయి ఏడుస్తున్న మల్లిక (లావణ్య)ను చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె వెంటపడి ఒకరకమైన టార్చెర్ పెడతాడు. ఆమెకోసం పోలీసులతో తన్నులు కూడా తింటాడు. అలాంటి వ్యక్తిని తన ఇంటిలో జరిగిన ఓ సంఘటన మార్చేస్తుంది. అది ఏమిటి? తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ:
ఈ కథ ఒక సున్నితమైన అంశం. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా కథంతా చెడిపోతుంది. రొటీన్‌గా పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడు, లేదంటే అవారాగాడు సంప్రదాయంగల అమ్మాయిని ప్రేమించే కథలు చాలానే వచ్చాయి. కానీ స్వర్గపురి వాహన డ్రైవర్ కథాంశంతో రావడం ఇదే తొలిసారి. అప్పుడెప్పుడో కాటికాపరిగా శివపుత్రుడులో విక్రమ్ చేసిన నటన చూసి అందరూ మెచ్చుకున్నారు. కానీ అందులో ప్రేమకోణం లేదు. కానీ ఇందులో శవాలను తీసుకెళ్ళవాడు విధవను ప్రేమిస్తే ఎలావుంటుంది అనేది పాయింట్. ఈ పాయింట్ మొదట విన్నవెంటనే ఏ నిర్మాత అయినా సినిమా తీయడానికి ముందుకు రాడు. కానీ వైవిధ్యమైన కథాంశాలు, కొత్తతరాన్నిప్రోత్సహించే గీతా ఆర్ట్స్‌వారు ముందుకు వచ్చి తీయడం విశేషం.
కథపరంగా కేరక్టర్‌పరంగా హీరో చేసే పనులు, మేనరిజం మనత్త్వం చాలా ఊరమాస్‌గా వుంటుంది. ఇలాంటి పాయింట్ మీద రెండు గంటలకు పైగా నిడివితో సినిమా తీయడం మాత్రం అంత తేలిక కాదు. చావు కబురు చల్లగా చూస్తున్నపుడు కూడా ఇదే భావన కలుగుతుంది. బాలరాజు తల్లి పాత్ర కూడా అలాగే వుంటుంది. తను పెళ్లిచేసుకున్న భర్త మంచానికే పరిమితం అవుతాడు. ఆమె తన మనస్సులోని భావాలను మంచి చెడులను చెప్పుకోవడానికి ఓ వ్యక్తికావాలి. కొడుకు చెప్పింది వినడు. ఆ స్థితిలో తనంటే ఇష్టపడే ఓ వ్యక్తిని కలిసి సేదతీరుతుంది. అది తెలిసిన కొడుకు ఏవిధంగా రియాక్ట్ అయ్యాడు. చివరికి ఏమి చేశాడు. అనేది ఆసక్తికరంగా వుంది. ఈ చిత్రానికి మాటలు ప్రధాన బలం. గతం జ్ఞాపలకాలు మాత్రమే కానీ జీవితం కాకూడదు. వంటి సన్నివేశపరంగా వచ్చే సంభాషణలు బాగున్నాయి. చావు-పుట్టుకల నేపథ్యంలో వేదాంత ధోరణిలో సాగే అతడి మాటలు మాత్రం సరిగూతాయి.
\బాధలో వున్న హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరో ప్రేమిస్తున్నట్లు చెప్పడం కూడా చాలా కొత్తగా అనిపించి ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు. ఇలాంటి చమక్కులు.. ఆశ్చర్యాలు తర్వాత మరిన్ని ఆశిస్తాం కానీ.. మంచి ఆరంభంతో మొదలై తర్వాత చల్లబడిపోతుందీ సినిమా. పాత్రలు - వాటి నేపథ్యం.. ఈ కథను ఆరంభించిన తీరు కొత్తగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కథనం రొటీన్ రూట్లోకి వెళ్లిపోవడం నిరాశ పరుస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఎందుకంటే నేపథ్యం అలాంటిది కాబట్టి.
వాస్తవంగా చూస్తే చదువూ సంధ్యా లేకుండా శవాల బండికి డ్రైవర్ గా పని చేసే అబ్బాయిని ప్రేమించడం అన్నది అంత తేలిగ్గా జరిగే విషయం కాదు. హీరో వ్యక్తిత్వం ఉన్నతంగా చూపించినా ఆ పాత్ర మీద ఒక ఆపేక్ష కలుగుతుంది. కానీ ఇక్కడ కథానాయకుడు విచక్షణ లేకుండా మొరటుగా ప్రవర్తిస్తుంటాడు. హీరోయిన్ అంటే ప్రాణం అంటాడే తప్ప ఆమెను చేసుకోవడానికి అతడికున్న అర్హత ఏంటన్నది ప్రశ్నార్థకం. ఇలాంటివి కొన్ని లాజిక్క్‌లు ఆలోచించకుండా ఉంటే పక్కా మాస్ తరహా కుటుంబాల్లోని జీవితాలు ఇలా వుంటాయని చెప్పేప్రయత్నం చేశాడు దర్శకుడు. ముగింపు సన్నివేశం కూడా పెద్దలకు కనువివప్పుకలిటేట్లువున్నా ఇది వాస్తవానికి దూరంగా వుందని చెప్పవచ్చు.
కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపించాడు. అతడి లుక్ తో పాటు నటన కూడా ఆ పాత్రకు సూటయ్యాయి. లావణ్య త్రిపాఠి డీగ్లామరస్ రోల్ లో చూడ్డానికి కొత్తగా కనిపించింది కానీ.. కథలో కీలకం అయినప్పటికీ.. ఆ పాత్రకు కథనంలో పెద్దగా స్కోప్ లేకపోయింది. ఇక మిగిలిన పాత్రలు మామూలే.
సంగీత దర్శకుడు జేక్స్ బిజోజ్ కథపరంగా బానీలు ఇచ్చాడు. చావ్లా ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సినిమా స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. కొత్త దర్శకుడు కార్తీక్ పెగల్లపాటి భిన్నమైన కథే అయినా దానిని అందరూ మెచ్చేలా తీయడం కష్టమే. కనుక ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయ్యే కథ.