సాంకేతికతః నిర్మాత : అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ, దర్శకత్వం : వెంకటేష్ త్రిపర్ణ, సంగీతం : భీమ్స్ సిసిరోలియో.
విడుదల తేది : నవంబర్ 19, 2021
కొందరు ఏ అనుభవం లేకుండా దర్శకుడు అవ్వాలనుకుంటారు. మరికొందరు దర్శకత్వ శాఖలో పనిచేసి అనుభవం సంపాదించాక ఆ తర్వాత దర్శకుడిగా ఎదగాలనే తాపప్రతయపడుతుంటారు. అలాంటి కోవలోని వారే వెంకటేష్ త్రిపర్ణ, మారుతీ దగ్గర పనిచేసిన ఆయన రూపొందించిన సినిమా రామ్ అసుర్. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్ ప్రధాన తారాగణంతో విడుదలైన ట్రైలర్ చాలా ఆసక్తికలిగించేలా వుంది. మరి సినిమా ఈరోజే విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.
కథః
రామ్ (రామ్ కార్తీక్) చురుకైన వ్యక్తి. తనకు తెలిసిన విజ్ఞానంతో వజ్రాన్ని తయారుచేయడానికి ప్రయత్నిస్తాడు. అదే టైంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె మాత్రం డబ్బున్న వాడైన మరో వ్యక్తినిప్రేమించి రామ్‌కు బ్రేకప్ చెబుతుంది. దాంతో మనసు వికలం చెందడంతో అతని స్నేహితుడి సూచనతో తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని నాడీ జ్యోతిష్కుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. అతను రామ్ వేలిముద్ర ఆధారంగా జాతకాన్ని పరిశీలించి నీ సమస్యకు పరిష్కారం రామాపురంలోని సూరి అనే వ్యక్తిని కలవడమే అని చెబుతాడు. అలా వెళ్ళిన రామ్‌కు సూరి చనిపోయి 30 సంవత్సరాలైందనే షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అయినా పట్టదలతో సూరి స్నేహితుడు శాని ద్వారా సూరి గురించి రామ్ తెలుసుకుంటాడు. విచిత్రంగా కొన్ని సంఘటనలు రామ్ జీవితంలో జరిగినట్లే అనిపిస్తాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది? సూరి ఆపేసిన కృత్రిమ వజ్రం తయారీని రామ్ చేశాడా? దాని వల్ల అతనికి ఎదురైన సంఘటనలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
రొటీన్ కథ కాకుండా దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ, ఎంచుకున్న అంశం భిన్నమైంది. వజ్రం తయారీని ల్యాబ్ టెక్నాలజీ తో మొదటగా 1950 దశకంలో ఓ వ్యక్తి చేశాడనే చారిత్రక అంశాన్ని ఆధారంగా కత రాసుకున్నాడు. అయితే మన పక్క రాష్ట్రంలోనే వజ్ర కరూర్ అనే ఊరిలో కూడా పంట పొలాల్లో కొండలలో వజ్రాలు దొరుకుతాయనీ, వాటిని పలువురు ప్రముఖులు నెలల తరబడి వెళ్ళి శోదించడం కొందరికి మాత్రమే తెలిసిన విషయం.
కథ ఆరంభంలో అలా కొండప్రాంతంలోని ఓ భాగంలో సూరి తవ్వాక వజ్రం దొరికాక దాన్నుంచి అతనికి వచ్చిన ఆలోచనతో కృత్రిమ వజ్రాన్ని తయారు చేయడం - అనేది కథలోని కీలమైకన అంశం. దీన్ని డీల్ చేయాలంటే చాలా కసరత్తే చేయాలి. అందుకోసం లైబ్రరీలో కొన్ని గ్రంథాలు చదివి సూరి తయారు చేస్తాడు. ఆ సన్నివేశాలను బాగానే డీల్ చేసినా లవ్ ట్రాక్ విషయంలో ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. ప్రేమైనా ఏదైనా డబ్బే కీలకం అనే అంశాన్ని బలంగా చూపిస్తే బాగుండేది. అందుకు అల్లిన సన్నివేశాలు ప్రేక్షకుడి ఫీలయ్యేలా చేయగలగాలి. అందుకు నటీనటులు కూడా ఇంకాస్త కష్టపడిదే బాగుండేది.
- సినిమాకి కీలకమైన సూరి పాత్రలో అభినవ్ సర్దార్ ఒదిగిపోయాడు. సూరి పాత్ర ఆహార్యం కెజిఎఫ్. హీరో స్థాయిలో చూపించినా ఆయన్నుంచి నటన ఇంకా రాబట్టాల్సింది. అప్పుడు సినిమా మరో స్థాయిలో వుండేది. సినిమా అంతా స్టయిలిష్‌గా తీసినట్లుగా నిదానంగా సాగుతుంది. అందుకు తగిన సంభాషణలు, పాటలు కూడా ఆకట్టుకునేలా మరింత కేర్ తీసుకోవాల్సింది. కొన్ని సన్నివేశాలు కట్టే, కొట్టే తెచ్చే అన్నట్లుగా అనిపిస్తాయి. ముఖ్యంగా సుమన్ పాత్రను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఉపయోగించుకోవాల్సింది.
- రామ్ పాత్రకి రామ్ కార్తీక్ న్యాయం చేశాడు. రొమాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్‌లో బాగానే చేశాడు..షెర్రీ అగర్వాల్ తన గ్లామర్ డోస్ తో ఆకట్టుకోగా.. చాందిని తమిళరాసన్ తన పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన శివ పాత్రలో శాన్వీ సాల్మన్. విభిన్నమైన పాత్రని చాలా అవవోకగా పోషించి మెప్పించాడు. రామాచారిగా శుభలేఖ సుధాకర్, బలరాం రాజుగా సుమన్‌తో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
- ఇంత మంచి కాన్సెప్ట్ ను తెరపైకి పకడ్బందీగా తీసుకురావాలంటే అందుకు ఒనరులు కూడా చాలా అవసరం. బడ్జెట్ పరిమితులు ఓవైపు, బలమైన స్టార్స్ లేకపోవడం మరోవైపు ఈ సినిమాను కాస్త వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. వున్న పరిమితులమేరకు నిర్మాణ విలువలు వున్నాయి. ఇక శాన్వి పాత్ర ముప్పై ఏళ్ళ తర్వాత కనిపించడం అందుకు సరైన ఆహార్యాన్ని కూడా చూపిస్తే బాగుండేది. ఎందుకంటే ఎక్కువ సేపు ఆ పాత్రే కథను నడిపిస్తుంది.
ఇలా చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటే సినిమా మరింత ఆకట్టుకునేది. ఏదిఏమైనా ఓ చారిత్రక అంశాన్ని, ప్రేమకూ, డబ్బుకూ లింకు వుందనే అంశాన్ని రెండింటినీ మిళితం చేసిన విధానం బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ గడిబిజి సౌండ్ లేకుండా వుండడం విశేషం. ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శంకర్ ఫైట్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొదటి ప్రయత్నం గనుక అం దరూ కష్టపడి చేశారు. కరోనా వల్ల కాస్త ఆలస్యం కావడంతో డిస్టబ్ అయినా కొత్త కథను తెలుగుతెరకు పరిచయం చేశారు.