ఈగల్ ప్రమోషన్ లో పద్ధతైన విధ్వంసం అంటూ ప్రకటన ఇచ్చారు. ఇలా ఇవ్వడానికి విధ్వంసం అలా వుంటుందని దర్శకుడూ చెప్పాడు. అంత విధ్వంసం ప్రేక్షకులు భరిస్తారా? అంటే, విక్రమ్ నుంచి కేజీఎఫ్. చిత్రాలను పోలుస్తూ, హాలీవుడ్ రాంబో సినిమా తరహాలో మా ఈగల్ వుంటుంది అని అన్నారు. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ:
ఢిల్లీలో పనిచేసే జర్నలిస్టు అనుపమ మార్కెట్ లో స్వెట్టర్ కొనడానికి వస్తే అక్కడ తలకోనకు చెందిన పత్తి నుంచి తయారైన స్వెట్టర్ కొనమని చెబుతూ, దాని మనుగడ ఒకరితోనే పోయిందని చిన్న కథ చెబుతుంది. అది వార్తగా పేపర్లో వస్తుంది. అది చూసిన కేంద్రప్రభుత్వం మండిపడి ఆ పేపర్ ను మూయించేస్తుంది. దాంతో ఉద్యోగం పోయిన అనుపమ కసితో అసలు ఈ వార్త వెనుక కథ కోసం తలకోన వస్తుంది.
అక్కడ రకరకాల వ్యక్తుల్ని కలిస్తుంది. ఒక గిరిజన ప్రాంతంలో ఫాం హౌస్ కట్టుకుని అరుదైన పత్తితో ఇలా బట్టలు తయారుచేసే ఫ్యాక్టరీ వుందనీ, అది సహదేవ్ (రవితేజ) ఉరఫ్ ఈగల్ అనే అరాచకవాదిదని తెలుస్తుంది. కానీ అందులో వెళ్ళడానికి సాధ్యపడదు. తన పరిశోధనలో భాగంగా ఆమె కలిసిన ప్రతి కదలికను ఇండియన్ రా కు చెందిన అవసరాల శ్రీనివాస్ కు తెలియడం ఆయన కూడా ఇక్కడకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఈగల్ ను ఎటాక్ చేయడానికి ఒకవైపు రా ముఠా, మరెోవైపు మిలట్రీ, ఇంకోవైపు టెర్రరిస్టులు, నగ్జల్స్, మరోవైపు తలనకోనకు చెందిన ఎ.ఎల్.ఎ. అజయ్ ఘోష్ గ్యాంగ్ ఒకేసారి వస్తారు. ఆ తర్వాత ఏమయంది? అసలు ఇంతమందికి ఈగల్ ఉరఫ్ సహదేవ్ శత్రువు అయ్యాడనేది కథలు కథలుగా సినిమా సాగుతుంది.
సమీక్ష
మొత్తంగా చూస్తే, ఒక వ్యక్తిని పట్టుకునేందుకు దేశదేశాలకు చెందిన మాఫియా ఎందుకు ఎదురుచూస్తుంది అనేది తెలుస్తుంది. తుపాకీతో ప్రాణం తీస్తే రాక్షసత్వం, పదిమందికి ఉపయోగపడేట్లు తుపాకి ఉపయోగిస్తే దేవుడు. ఈ పాయింట్ తో దర్శకుడు రాసుకున్న కథ. ఆ కథను నడిపివిధానం అంతా హాలీవుడ్ స్టయిల్ లో వుంటుంది. రాంబో తరహాలో విధ్వంసం వుంటుంది. అందులో దేశాలకు సంబంధించిన అంశం వుంటే ఇందులోనూ అంతే ఇదిగా సమస్య వుంటుంది. కానీ అది పత్తి రైతులనుంచి దేశంలో జరిగే బాంబ్ బ్లాస్ట్ లతోనూ, టెర్రరిజంతోనూ ముడిపెడుతూ చాలా పెద్ద కథగా రాసుకున్నాడు. ముగింపు కూడా సీక్వెల్ వుంటుందని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు.
ఇలాంటి సీరియస్ కథలోనూ లవ్ ట్రాక్ కూడా వుంటుంది. కావ్యథాపర్ కూ, రవితేజ మధ్య సాగే ప్రేమ ఈగల్ లా ఓ కన్నువేసి వెంటాడుతూ ఆమెను ప్రేమిస్తాడు. ఇది కొత్తగా వున్నా, దానికి విధ్వంసం జోడించాల్సివచ్చింది. ఇలా ప్రతి సీన్ లోనూ హై యాక్షన్ అంశాలున్నాయి.
సహదేవ్ వుండే ఫామ్ హౌస్ లో సాగే విధ్వంసం ఎపిసోడ్, అమ్మవారి విగ్రహం ఎపిసోడ్ తెలుగులో కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి తరహా సినిమా ఇంతవరకు రాలేదనే చెప్పాలి. ఇందులో నీతి కూడా వుంది. అమెరికాలో మనుషులకంటే ఆయుదాలే ఎక్కువగా తయారవుతున్నాయి. అది ఇండియాకూ పాకింది. అందుకే ఎవరో ఒకరు ముందడుగు వేయాలని ఈగల్ చేసిన ప్రయత్నమే ఈ విధ్వంసం అని దర్శకుడు వివరిస్తాడు.
కథంతా అనుపమ ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగుతూ రివర్స్ కథనం వుంటుంది. దాంతో కొంత అసహనం కూడా స్క్రీన్ ప్లే లో గోచరిస్తుంది. ఓ దశలో విసుగుపుట్టింది. ఈ సినిమా మొదలు కావడం ఆలస్యం.. విధ్వంసం.. ఉత్పాతం.. విస్ఫోటనం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంటాయి పాత్రలు. హీరోకు ఒక్కొక్కరు ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. కథను చెప్పే క్రమంలో గతం-గరుడపురాణం.. మృగసిర-మధ్యరాత్రి.. పట్టపగలు-పద్ధతైన దాడి.. కంచె-కాపరి.. అంటూ పదబంధాలు వాడి తెర మీద అద్భుతం ఏదో చూపించబోతున్న భ్రమలు కల్పిస్తారు.
దర్శకుడు కార్తీక్ ఇంతకు ముందు నిఖిల్ తో సూర్య వెర్సస్ సూర్య అనే వెరైటీ సినిమా తీశాడు కానీ ముగింపులో తడబడ్డాడు. ఈసారి తను ఎంచుకున్న కథ మరీ కొత్తగా అనిపించకపోయినా.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ సహదేవ్ చేసే అరాచకాలు హైలెవల్ లో వుంటూనే ప్రభుత్వానికి సవాల్ గా మారతాయి.
అయితే ఇందులో విచిత్రం ఏమంటే, ఈగల్ కు చెందిన పత్తి ఉత్పత్తి గురించి రాస్తే, కేంద్ర ప్రభుత్వం సైతం రియాక్ట్ అయ్యే విధానంలో సరైన బలం లేదు. ఇక మిగిలిన పాత్రలు వారికి వారి స్థాయికి బాగానే చేశారు. ప్రథమార్ధం చాలా వరకు నిద్రతెప్పించేలా వుంది. యూరప్ నేపథ్యంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ సోసోగా అనిపిస్తుంది. హీరో-హీరోయిన్ మధ్య ప్రేమకథలో గన్ను కీలక పాత్ర పోషించడం వెరైటీ. కానీ ఈ ఎపిసోడ్లో ఎమోషన్ మాత్రం అనుకున్నంత స్థాయిలో పండలేదు. ట్విస్టులు ఒక్కొక్కటి రివీల్ కావడంతో చివరి అరగంటలో సినిమా ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. హీరో మిషన్ ఏంటో అర్థమయ్యాక కథ క్లైమాక్స్ కు దారి తీస్తుంది.
ఇందులో ప్రధాన ఆకర్షణ రవితేజ. యాక్షన్ ఎపిసోడ్ లోనూ, లుక్ లోనూ బాగా చేశాడు. తక్కువ మాటలతోనే ఈ పాత్రతో ఇంపాక్ట్ వేయగలిగాడు. అనుచరుడిగా నవదీప్ స్టయిల్ యాక్షన్ వుంటుంది. వినయ్ రాయ్ ఇందులో కొంచెం భిన్నమైన పాత్ర చేశాడు
టెక్నికల్ గా సంగీత దర్శకుడు డేవ్ జాండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ భిన్నంగా ట్రై చేశాడు. నేపథ్య సంగీతం మన కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ వినిపించేలా లౌడ్ గా ఉండదు. ఒకే ఒక పాట మినహా కథకు అనుగుణంగా సంగీతం సాగుతుంది. ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాత పెట్టుబడి తెర మీద కనిపిస్తుంది. కాస్టింగ్.. ప్రొడక్షన్ సహా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. మణిబాబు కరణం మాటలు సినిమాలో సరిగా సింక్ అవ్వలేదు. యాక్షన్ సినిమాలు చూసేవారికి ఇది నచ్చవచ్చు. దీన్ని ఆదరిస్తే సీక్వెల్ తో మహావిధ్వంసం రావచ్చు.