సాహిత్యం : సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
కూర్పు : మధు
కళా దర్శకుడు : రమణ వంక
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : వేగేశ్న సతీష్.
సంక్రాంతి అంటేనే ఇంటిల్లపాది పండుగ. ఇల్లంతా సందడిగా ఉండే వాతావరణమే సంక్రాంతి. ఇదే దీనికి ఆలవాలం. సంక్రాంతి పడుగ రోజునే ఇంట్లోని అందరం కలిసి సరాదాగా నవ్వుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. ఈ కథాంశంతో పాటు మూడు తరాల కుటుంబ అనుంబంధాలను ఆధారంగా చేసుకుని సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం `శతమానం భవతి`. ఓ కుటుంబంలో మూడు తరాలకు మధ్య జరిగిన అందమైన అనుభూతులు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనురాగాలు, అప్యాయతలు వీటన్నింటిని కలబోతే `శతమానం భవతి`. ఈ సినిమా కథ విషయానికి వస్తే....
కథ విశ్లేషణ...
నిత్యం పచ్చగా కనిపించే ఆత్రేయపురం అనే పల్లెటూరులోని రాజు (ప్రకాష్‌రాజ్), జానకమ్మ(జయసుధ)లతో మనవడు రాజు(శర్వానంద్) కలిసి నివసిస్తుంటాడు. రాజుగారి ఇద్దరి కొడుకులు, ఒక కూతురు అమెరికాలో ఉంటారు. ఎప్పుడో కానీ తమను చూడటానికి రాని పిల్లలకోసం రాజుగారు బాధ పడుతూ ఉంటారు. ఓ పథకం వేసి తన పిల్లలను సంక్రాంతికి వచ్చేలా చేస్తారు రాజు. ఇంటికి వచ్చిన కొడుకులు, కూతుళ్ళతో సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో రాజుగారి మనవరాలు నిత్యా(అనుపమ పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. ఈలోపు రాజు వేసిన పథకం జానకమ్మకు తెలియడంతో కుటుంబంలో పొడచూపుతాయి. అసలు రాజు వేసిన పథకం ఏమిటి? అనే విషయం తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రంలో శర్వానంద్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా అందంగా, మంచి నటనతో మార్కులను కొట్టేసింది. ఇక ప్రకాష్ రాజ్, జయసుధల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమతమ పాత్రలకు ప్రాణం పోశారు. నరేష్, ఇంద్రజ, శివాజీ రాజా, ప్రవీణ్, సిజ్జు, శ్రీరాం, మధురిమ, నీల్యా, ప్రమోదిని, మహేష్, భద్రం, హిమజ, ప్రభు తదితరులు వారివారి పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిసిన కథనే కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్, మిక్కీ జె.మేయర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. కథలో చిన్న ట్విస్ట్ పెట్టేసి సినిమా కథను కాస్తా ఆసక్తికరంగా నడింపిచడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కనపడుతుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ స్లోగా ఉంది. సెకండాఫ్ విషయంలో కాస్తా జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమాను ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు.