కథ
చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన వడమాలకు చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళి దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రైజ్ మనీగా ఇచ్చే యాభై లక్షల రూపాయలను సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఇంట్లో చెప్పకుండా ఓ రాత్రి చెక్కేస్తారు. అలా ముంబై అనుకుని బెంగుళూరు వెళతారు. అక్కడ ఓ పిల్లాడు కిడ్నాప్‌కు గురవుతాడు. ఆ సమయంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజ (తాప్సీ) ఇద్దరినీ ఆదరిస్తుంది. ఆమెకు విక్రమ్, ఎస్.ఐ. సతీశ్ సహరిస్తుంటారు. ఇక శైలజ ఇద్దరు పిల్లలతో చైల్ట్ ట్రాఫికింగ్ కు అరికట్టేందుకు మిషన్‌ను అప్పగిస్తుంది. దాన్ని వారు నెరేర్చారా? తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
తాప్సీకి కథ నచ్చి చేశానని చెప్పింది. అందుకే కథనంలో రెండు మూడు సీన్స్ లోనే ఆమె కనిపిస్తుంది. కథంతా ముగ్గురు పిల్లలదే. రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రలు పోషించిన హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ ముగ్గురూ చాలా చలాకీగా నటించారు వారు చేసిన సహజమైన నటన, అల్లరి, అమాయకత్వం మొదటి భాగం ఫుల్ ఎంటర్‌టైన్ చేయిస్తుంది. తెగింపు, తప్పో ఒప్పో తెలియకపోయినా ప్రదర్శించే ధైర్యం ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థంలో వారు చేసిన సాహసం లాజిక్‌గా చూస్తే కష్టమే. కానీ సినిమాటిక్‌గా చూసి ఆనందించాల్సిందే. క్లయిమాక్స్ లో సైతం పిల్లలు దావుద్‌ను పోలీసులకు అప్పగించామనే భ్రమలో వుంచేలా చేయడం కూడా ఫన్ కోసమే అనిపించినా కథలో సీరియస్‌నెస్ లోపించింది.
ఇక తాప్సీ పక్కనే ఉండే విక్రమ్ పాత్రధారి రవీంద్ర విజయ్ తమిళ యాసతో వుంటుంది. మలయాళ నటుడు హరీశ్ పేరడి గెటప్ ఆకట్టుకునేలా ఉంది. కానీ ఆయన నుండి కూడా గొప్ప నటన అయితే తీసుకోలేదు. ఒకటి రెండు సన్నివేశాల్లో హరీశ్ పేరడీ నటన కంటే కెమెరాలో డిఫరెంట్ యాంగిల్స్ లో అతని చూపించిన విధానమే ఆకట్టుకుంది. సుహాస్, హర్షవర్థన్, వైవా హర్ష, సత్యం రాజేశ్, మధుసూదన్, సందీప్ రాజ్ వంటి వాళ్ళు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. కిశోర్ కుమార్ పొలిమేర, శరణ్య ప్రదీప్ తో మరికొందరు పిల్లల తల్లిదండ్రులుగా నటించారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో ఆర్గాన్ ట్రేడ్ ను ప్రధానాంశంగా తీసుకుని వినోదాత్మకంగా తెరకెక్కించిన దర్శకుడు స్వరూప్. ఈ చిత్రంలో చైల్డ్ ట్రాఫికింగ్ ను ఎంపిక చేసుకున్నాడు. తీసుకున్న అంశం గొప్పదే అయినా దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబడ్డాడు. పిల్లలతో తాప్సీ కథ నడిపించడం పెద్దంత కన్వెన్సింగ్ గా లేకపోయింది. 2014లో బీహార్‌లోని ఓ గ్రామంలో ముగ్గురు పిల్లలు ఇలానే దావూద్ కోసం ముంబై వెళతారు. కానీ అక్కడ బెడిసికొట్టడంతో పోలీసులు తిరిగి ఇంటికి పంపిస్తారు. ఈ పాయింట్‌ను తీసుకుని పిల్లలు మిషన్‌ను చేధిస్తే ఎలా వుంటుందని కల్పిత కథ రాసుకుని తెరకెక్కించాడు దర్శకుడు.
మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ అధినేతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి రాజీపడకుండా సినిమాను నిర్మించారు. మార్క్ కె రాబిన్ స్వరాలు భిన్నంగా ఉన్నాయి. నేపథ్య సంగీతమూ బాగుంది. దీపక్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. మాటలూ వినోదాత్మకంగా ఉన్నాయి. ప్రధానంగా పేలవమైన కథనం, నిరాశ పరిచే క్లైమాక్స్ లు సినిమాకు స్పీడ్ బ్రేకర్లుగా నిలిచాయి. అందుకే టైటిల్‌లోనే మిషన్ అసాధ్యం అనేలా పెట్టాడు.