కోలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన గతంలో నటించిన 'తుపాకీ', 'సర్కార్', 'పోలీస్' వంటి చిత్రాలను తెలుగులోకి అనువాదం చేశారు. దీంతో ఆయన చిత్రాలు టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తకాదు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన చిత్రం 'విజిల్'. ఇది కూడా తమిళ అనువాద చిత్రమే. ఈ చిత్రం అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించగా, నయనతార హీరోయిన్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఫుట్‌బాల్ క్రీడానేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పించింది? విజయ్-అట్లీ కాంబినేషన్‌లోని మ్యాజిక్ పునరావృతమైందా? లేదా అనే విషయాలను తెలుసుకోవాలంటే చిత్రం కథలోకి వెళ్లాల్సిందే.
చిత్ర కథ :
చెన్నైలోని ఓ మురికివాడలో రాయప్పన్ (విజయ్) నివసిస్తుంటాడు. ఈయన ఓ పెద్ద గ్యాంగ్ లీడర్. ఈయన కుమారుడు మైఖేల్ అలియాస్ విజిల్ (విజయ్). విజిల్‌ను జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ క్రీడాకారుడుగా చూడాలన్నది రాయప్పన్ కోరిక. ఆశయం కూడా.
ఈ పరిస్థితుల్లో ఫుట్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌ఫిప్‌లో పాల్గొనడానికి విజిల్ ఢిల్లీ వెళ్తున్న సమయంలో రాయప్పన్ హత్యకు గురవుతాడు. దీంతో మైఖేల్ పుట్‌బాల్ క్రీడకు దూరమై గ్యాంగ్‌స్టర్‌గా తండ్రి బాధ్యతల్ని స్వీకరిస్తాడు.
అనుకోని పరిస్థితుల్లో మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో విజిల్ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏమిటి? మహిళల్ని స్ఫూర్తివంతంగా తీర్చిదిద్ది విజేతలుగా నిలిపే క్రమంలో విజిల్ చేసిన ప్రయత్నాలేమిటి? ఈ అంశాలన్నింటకి సమాధానమే మిగతా చిత్ర కథ.
విశ్లేషణ :
గతంలో వెండితెరపై 'చక్ దే ఇండియా', 'దంగల్' వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాలు మంచి ప్రజాధారణ పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి కూడా. ఈ కోవకు చెందినదే 'విజిల్'. కోలీవుడ్‌లో విజయ్‌కున్న మాస్ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ భావోద్వేగాలతో ఈ క్రీడా డ్రామాను తెరకెక్కించారు.
ప్రథమార్థమంతా మురికివాడలో రాయప్పన్ గ్యాంగ్‌వార్, విజిల్-ఏంజెల్ (నయనతార)నడుమ ప్రేమాయణం నేపథ్యంలో కథ సాగింది. రాయప్పన్ హత్యతో కథాగమనం కీలక మలుపు తీసుకుంటుంది. ఫుట్‌బాల్ అంటే ఆసక్తి వుండి సరైన ఆర్థిక స్థోమత లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతుల కోసం విజిల్ ఓ అకాడమీ స్థాపించడం.. వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం.. ఈ నేపథ్యంలో చక్కటి ఎమోషనల్ డ్రామా పండింది.
యాసిడ్ దాడికి గురైన యువతిలో స్ఫూర్తినింపి ఆమెను ఫైనల్ పాల్గొనడానికి కోచ్ విజిల్ ప్రేరేపించి ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. ప్రథమార్థమంతా విజయ్ తాలూకు మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే ప్రయత్నం చేశారు. ద్వితీయార్థంలో కోచ్‌గా విజిల్ యువతుల్ని ఎలా విజేతలుగా తీర్చిదిద్దాడమే అంశంపై దృష్టిపెట్టారు.
ఈ క్రమంలో భావోద్వేగాలతో కూడిన డ్రామాను పండించారు. పుష్కలమైన మాస్ అంశాలున్న సబ్జెక్ట్‌లో మహిళా సాధికారత గురించి చర్చించడం ప్లస్‌పాయింట్‌గా అనిపిస్తుంది. అయితే ప్రథమార్థంలో మురికివాడ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్స్ కొంచెం అతిగా అనిపిస్తాయి. విజయ్‌కున్న ఫాలోయింగ్, మాస్ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ కథను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో వచ్చే సన్నివేశాల్ని అథెంటిక్‌ఫీల్‌తో దృశ్యమానం చేశారు. నిజమైన ఆటను చూస్తున్నామనే అనుభూతిని కలిగించేలా ఆ ఎపిసోడ్స్‌ను తీర్చిదిద్దారు.
అయితే ద్వితీయార్థంలో కథాగమనం సాగతీతగా అనిపిస్తుంది. కొన్ని పోరాట ఘట్టాల్ని అసందర్భంగా చూపించారనే భావన కలుగుతుంది. కేవలం విజయ్ అభిమానుల్ని సంతృప్తిపరచడానికే వాటిని తీశారనిపిస్తుంది. క్లైమాక్స్ ఘట్టాల్ని ఎలాంటి నాటకీయత లేకుండా ప్రేక్షకుల ఊహకు తగినట్లుగానే ముగించారు. ప్రతినాయకుడు జాకీఫ్రాఫ్‌తో విజిల్ పోరాటానికి అంత బలమైన కారణాలు కనిపించవు.
ఎవరెలా చేశారంటే :
విజయ్ తనదైన శైలి నటనలో ప్రేక్షకుల్ని మెప్పించాడు. సినిమా ఆద్యంతం తన భుజాలపై మోశాడు. కథానాయికగా నయనతార అభినయం ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర చిత్రణకు కథలో అంతగా ప్రాధాన్యత దక్కలేదు. ప్రతినాయకుడిగా జాకీష్రాఫ్ అంత బలమైన విలనీ పండించలేకపోయాడు. మిగతా పాత్రల్లో యోగిబాబు, వివేక్ ఫర్వాలేదనిపించారు.
ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. గుర్తుంచుకునే గీతం ఒక్కటి లేదనిపిస్తుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. జీకే విష్ణు ఛాయాగ్రహణం ప్రతి ఫ్రేమ్‌ను ఉన్నతంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా ఫుట్‌బాల్ మైదానం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన ప్రతిభ కనిపించింది. భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. మాస్ అంశాలు కలబోసిన స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించడంలో దర్శకుడు అట్లీ కృతకృత్యుడయ్యారు. మహిళల్లో స్ఫూర్తి నింపే అంశాలుండటం ప్లస్‌పాయింట్‌గా అనిపిస్తుంది.