మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో. చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "విజేత". తొలి సినిమాతో హీరోయిజం చూపించాలనే ఉద్దేశంతోకాకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. పాత చిరంజీవి టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా తండ్రి కొడుకుల అనుబంధాన్ని తెలియజేసేదిగా ఉంది. మరి ఈ చిత్ర కథ ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం.
విజేత కథ :
శ్రీనివాసరావు (మురళీ శర్మ) స్టీల్ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్న శ్రీనివాసరావు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా జీవితంతో రాజీపడి సర్దుకుపోతుంటాడు. ఈయనకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. కొడుకు పేరు రామ్(కల్యాణ్ దేవ్). ఇంజనీరింగ్ చదివినా పనీబాటలేకుండా తిరుగుతుంటాడు. రామ్ ఎదురింట్లో జైత్ర (మాళవికా నాయర్) అద్దెకు వస్తారు. ఈమెను చూడగానే మనసు పారేసుకునే రామ్... ఆమెను ఆకర్షించేందుకు లేనిపోని ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. ఇందుకోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తాడు. ప్రారంభంలో తప్పులు జరిగి చెడుపేరు వస్తుంది.
అదేసమయంలో శ్రీనివాసరావుకి గుండెపోటు వస్తుంది. శ్రీనివాసరావు తను లేకపోతే తన కుటుంబం ఏమైపోతుందోనని లోలోపన మథనపడిపోతుంటారు. అది చూసిన శ్రీనివాసరావు స్నేహితుడు (తనికెళ్లభరణి).. రామ్‌కి శ్రీనివాసరావు గురించి నిజం చెప్పి.. కుటుంబానికి తోడుగా నిలబడమని కోరతాడు. రామ్ కూడా అప్పటినుంచి దారి మార్చుకుని తండ్రికి చేదోడువాదోడుగా ఉంటుంటాడు. ఆ సమయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? కొడుకుగా శ్రీనివాసరావు కలను ఎలా తీర్చాడనేదే మిగిలిన కథ. దీన్ని వెండితెరపై చూడాల్సిందే.
టెక్నికల్ విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. కల్యాణ్‌దేవ్ నటన అంతంతమాత్రంగానే ఉంది. ఈ సినిమాకు మురళీశర్మ నటన ప్రాణం పోసిందని చెప్పొచ్చు. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ అంతటినీ మురళీశర్మ క్యారీ చేశాడు. తనదైన నటనతో, అనుభవంతో పాత్రకు పరిపూర్ణత చేకూర్చాడు. ఇక జయప్రకాశ్, తనికెళ్లభరణి, మాళవికా నాయర్, ప్రగతి ఇతరుల నటన వారి వారి పరిధి మేర చక్కగా నటించారు. మాళవికా నాయర్ పేరుకు హీరోయిన్ కానీ... ఆ పాత్రలో నటనకు పెద్దగా స్కోప్ లేదు.
ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు రాకేశ్ శశి ఫస్టాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే సినిమాను నడిపించాడు. హీరో జులాయిగా తిరగడం.. తండ్రి బాధ్యతలను తెలుసుకోకపోవడం వంటి తరహా క్యారెక్టర్‌తో నింపేశాడు. హీరో, అతని స్నేహితుల మధ్య వచ్చే హాస్యపు సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇక సినిమా ద్వితీయార్థం అంతా హీరో బాధ్యతగా మెలగడం.. తండ్రి కలను తీర్చడానికి కొడుకుగా తన వంతు బాధ్యతను నేరవేర్చడం వాటి సందర్భానుసారం వచ్చే సన్నివేశాలు బావున్నాయి. సంభాషణలు అక్కడక్కడా బావున్నాయి. సెంథిల్ కెమెరా పనితనం గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన ట్యూన్స్ ఓకే. నేపథ్య సంగీతం బాగానే ఉంది. మొత్తంగా చూస్తే ఓ ఎమోషనల్ టచ్‌తో సాగే చిత్రమిది.
ఈ చిత్రం ప్లస్ పాయింట్స్‌ను పరిశీలిస్తే, మురళీ శర్మ నట, చిత్రం రెండో భాగం, తండ్రి కొడుకుల మధ్య సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, కెమెరా వర్క్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్ల విషయానికొస్తే, తొలి భాగం రొటీన్‌గా సాగడం, హాస్యం పండగపోవడం. మొత్తానికి ఈ చిత్రం తండ్రి గొప్పతనాన్ని చెప్పే చిత్రంగా పేర్కొనవచ్చు.