తిరుమల బ్రహ్మోత్సవాలు : వైభవంగా శ్రీనివాసుడి రథోత్సవం
మంగళవారం, 25 సెప్టెంబరు 2012 (14:01 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అయిన మంగళవారం ఉదయం శ్రీనివాసుడి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. మలయప్పస్వామి రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. భక్తులు చేస్తున్న హరినామస్మరణతో తిరుమల గిరులు మార్మోగి పోతున్నాయి.
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని బోధించడమే ఈ రథోత్సవం ప్రత్యేకత. ఇందులోభాగంగానే శ్రీవేంకటేశ్వరుడు ఎనిమిదో రోజు ఉదయం తన రథంలో ఊరేగి భక్తులకు దర్శనిమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. వచ్చే ఉత్సవాలకల్లా స్వామివారికి స్వర్ణ రథాన్ని సిద్ధం చేస్తామన్నారు. దసరా ఉత్సవాలకు మైదానాల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.