తిరుమల బ్రహ్మోత్సవాలు: సప్తగిరుల్లో పోటెత్తిన భక్తజనం
ఆదివారం, 2 అక్టోబరు 2011 (16:35 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్త జనులు సప్తగిరుల వైపు పోటెత్తుతున్నారు. శని, ఆదివారాలు వరుసగా సెలవు దినాలు కావడంతో పాటు.. సోమవారం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ జరుగనుంది. దీన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా ఏడుకొండల పైకి తరలి వెళుతున్నారు.
ముఖ్యంగా కాలినడక మార్గమైన మెట్లదారిలో వేలాది మంది భక్తులు కొండపైకి నడిచి వెళుతున్నారు. ఊహించని విధంగా భక్తులు రావడంతో దాతలు పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలు పంచి పెట్టారు. ఒక దశలో ఆహార పదార్థాలు చాలకపోవడంతో ఆగమేఘాలపై తయారు చేయించి భక్తులకు పంపిణీ చేశారు.
శ్రీవారిమెట్టు వద్ద కొందరు భక్తులు స్వామి వారికి పిండి తలిగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. గురుడ సేవకు ఒక్కరోజు ముందుగా తిరుమల చేరుకునే భక్తులందరూ ఈ మార్గంలోనే తిరుమలకు చేరుకున్నారు.
శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు మాత్రం ఇక్కడి సౌకర్యాల కల్పనపై దృష్టి సారించ లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న పాదాల మండపం నుంచి అర కిలోమీటరు దూరం వరకు బండలు పరచారు. అయితే పైకప్పు వేయడాన్ని మరిచారు.
దీంతో భక్తుల కాళ్లు భగభగమంటూ మండుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక్కడకు రాగానే భక్తులు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇదే విషయంపై తితిదే ఉన్నతాధికారులకు పలు మార్లు తెలియపరచినప్పటికీ ఫలితం లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడక తప్పడం లేదు.