తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున జరిగే ఉత్సవ వేడుకల్లో మోహినీ అవతారం అత్యంత ప్రధానమైనది. ఈ వేడుకల్లో భాగంగా ఐదోరోజైన శనివారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనిమిచ్చారు.
అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభం కావడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పరమశివుడిని సైతం సమ్మోహనపరచి, క్షీర సాగర మధనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసింది ఈ అవతారం కాబట్టే.. దీన్ని అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు.
మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటేందుకు శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరించి.. బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించేందుకు తిరుమల గిరులకు విచ్చేసిన భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.