పెద్దశేష వాహనం వీక్షిస్తే సౌభాగ్యాలు... తలనీలాలు సమర్పిస్తే ఫలితం..?!!

బుధవారం, 19 సెప్టెంబరు 2012 (12:30 IST)
బ్రహ్మోత్సవాల్లో తొలి అంకం మంగళవారం రాత్రి మొదలైంది. తిరుమలేశుడు సోమవారం రాత్రి పెద్దశేష వాహనంపై దర్పంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ఆ కోనేటి రాయుడిని దర్శించుకుని పునీతులయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల గిరికి వచ్చారు. గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమ్రోగాయి.

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి భక్తులు సమర్పించే మొక్కుల వెనుక పరమార్థం, ఏడుకొండలవాడి దర్శన వల్ల కలిగే భాగ్యాలు ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలేశ్వరునికి భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఈ ఆచారం ఎప్పుడు ఎలా ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు. కానీ తలనీలాలు సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.
WD

అటువంటి శిరోజాల సమర్పణ పురుషులు మాత్రమే చేసే కాలంలో తొలిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలు నీలాంబరి అట. అటువంటి భక్తురాలి పేరు మీద స్వామివారే స్వయంగా తన ఏడుకొండలలో ఒకదానికి 'నీలాద్రి' అని పేరు పెట్టాడని అంటారు.

శ్రీనివాసుని అభయహస్తం ఆశ్రయిస్తే సంసార సాగరం మొల లోతే....

నిండైన రూపం శ్రీవారిది. ఆ శ్రీవారి అలంకరణ ఏ క్షణంలోనైనా వంద కిలోల ఆభరణాలను కలిగి వుంటుంది. ఇక భక్తులు అందించే కానుకలను వేరువేరుగా తీసి పెట్టడానికే ప్రత్యేకంగా వందమంది పని చేస్తున్నారంటే ఆ స్వామివారికి అందే కానుకలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఉహించుకోవచ్చు.

తిరుమల విగ్రహం చరిత్రకందని స్వయంబు రూపం. ఆ రూపం ఆగమ శాస్త్రాలకందనిది. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగభరణాలు, ఆలయగోపురం మీద సింహ వాహనం.. వెరసి సర్వదేవతా సమన్వయరూపం ఆ వేంకటేశ్వరుడు.

సాధారణంగా దేవతా విగ్రహాల కుడిచేయి అభయ హస్తంగా వుంటుంది. ఎడమచేయి వరద హస్తంగా వుంటుంది. కాని శ్రీ వేంకటేశ్వర విగ్రహం మాత్రం కుడిచేయి నడుము దగ్గర వున్నట్టు కనిపిస్తుంది. ఈ చేతుల భంగిమకు అర్థం ఈ పాదాలు ఆశ్రయిస్తే సంసారమనే సాగరం కూడా మొలలోతు మాత్రమే అనిపిస్తుందని.
WD