వైభవోపేతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీవారి ఆలయ సుద్ధి కార్యక్రమంతో ఆరంభమయ్యే శ్రీనివాసుని బ్రహ్మోత్సవ వేడుకలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా సాగాయి. ఈ అంకురార్పణం మరుసటి రోజున ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి.

అంకురార్పణ మొదటి రోజు నుంచి సర్వ మంగళ ముహుర్తాన ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ధ్వజారోహణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులకు ఆహ్వానం పలుకుతారని పండితుల విశ్వాసం. ఇలా తొమ్మిది రోజులు పాటు సాగిన బ్రహ్మోత్సవాల్లో స్వామి వారు వివిధ వాహనాలపై తిరు మాడవీధుల్లో ఊరేగారు.

కాగా, బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి చూర్ణాభిషేకం చేయించి, సర్వాలంకార భూషితుడైన మలయప్పను సుగంధ పుష్పాలతో అలంకరించిన పల్లకిలో పుష్కరిణి సమీపంలోని శ్రీ వరాహస్వామి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ఊరేగింపుగా వరహాస్వామి మండపం వద్దకు వచ్చిన వెంకన్న స్వామికి పండితులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి, చక్రానికి స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేయించారు. తర్వాత స్వామి వారిని పల్లకిలో ఊరేగించి ధ్వజస్తంభం దగ్గర గల గరుడునికి పూజా నైవేద్యం సమర్పించి గరుడ ధ్వజాన్ని కిందకి దించారు. ఈ ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవోపేతంగా ముగిశాయి.

వెబ్దునియా పై చదవండి