హ్యాపీ బర్త్ డే టు యంగ్ హీరో "ఉదయ్ కిరణ్"!

WD
"చిత్రం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో "ఉదయ్ కిరణ్". నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని వంటి సినిమాల ద్వారా మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్‌కు నేడే పుట్టినరోజు (జూన్-26).

రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో 1980వ సంవత్సరంలో పుట్టిన ఉదయ్ కిరణ్.. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాడు. తొలి సినిమా 'చిత్రం' బ్లాక్ బ్లస్టర్ కావడంతో ఉదయ్ కిరణ్‌పై మాస్ ముద్రపడింది.

అనంతరం ప్రేమకథా నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటిస్తూ వచ్చిన ఉదయ్ కిరణ్‌కు హోలీ, శ్రీరామ్, జోడీ నెం1, లవ్ టుడే, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా వంటి చిత్రాలు ఆశించిన గుర్తింపును సంపాదించిపెట్టలేకపోయాయి. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్‌కు ఇటు తెలుగు, అటు తమిళంలో హిట్ సినిమాలు కరువయ్యాయి.

అయితే ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్. కరుణానిధి కథతో రూపొందిన "అల్లాడిస్తా", నువ్వక్కడుంటే నేనక్కడుంటా వంటి చిత్రాలు ఉదయ్ కిరణ్‌కు మంచి గుర్తింపును సంపాదించి పెడుతాయని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. కాగా.. నువ్వు నేను చిత్రానికి గాను 2001వ సంవత్సరంలో ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్‌ సినిమాలు హిట్ కావాలని ఆశిస్తూ.. ఆయనకు మనం కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం..!?

ఉదయ్ కిరణ్ పర్సనల్ టచ్.
పూర్తి పేరు: వాజ్‌పేయాజుల ఉదయ్ కిరణ్.
పుట్టిన తేదీ: జూన్ 26, 1980 (1980-06-26).
వయస్సు: 29 సంవత్సరాలు.
జన్మస్థలం: ఆంధ్రప్రదేశ్.
తొలి తెలుగు చిత్రం: చిత్రం
నటించిన చిత్రాలు: 14 చిత్రాలకు పైగా.

వెబ్దునియా పై చదవండి