ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి ఇంటి అద్దెలు భరించడం చాలా కష్టం. అందుకే, చాలా మంది కష్టమైన సరే.. రెంట్ తక్కువగా ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వెళ్తుంటారు. బండి మీదో, బస్సులోనే గంటల తరబడి ట్రాఫిక్‌ను దాటుకుంటూ విధులకు చేరుకుంటారు. అయితే, అమెరికాలో ఓ అమ్మాయి మాత్రం ఇంటి అద్దెలు భరించలేక.. ఏకంగా 770 మైళ్లు ప్రయాణం చేస్తోంది. అది కూడా విమానంలో..! వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం..!
సౌత్ కరోలినాలోని కార్లెస్టన్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సోఫియా సెలెంటానో యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతోంది. వేసవి సెలవులకు కార్లెస్టన్‌కు వచ్చిన ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ సంస్థలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభించింది. అయితే న్యూజెర్సీలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ.
శివారు ప్రాంతాల్లో ఉండాలన్న కనీసం నెలకు 3400 డాలర్లు చెల్లించాలి. అయితే, రెండునెలల తన ఇంటర్న్‌షిప్ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. దీంతో అద్దెలు భరించలేని ఆమె వినూత్న ఆలోచన చేసింది. కార్లెస్టన్ నుంచి సుమారు 770 మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్సీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది.
రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా.. అందుకు విమాన టికెట్, క్యాబ్ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. తన ఇంటి నుంచే వెళ్లడం మంచిదని భావించిన సోఫియా.. విమానప్రయాణం చేస్తోంది. అయితే, ఇందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నానని ఆమె చెబుతోంది.