#AYODHYAVERDICT కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల పహారా

శనివారం, 9 నవంబరు 2019 (09:35 IST)
సుప్రీంకోర్టు అయోధ్యపై తుది తీర్పును వెలువరించబోతున్న సమాచారం తెలిసిన వెంటనే శనివారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్యలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు అయోధ్యలో పహారా కాస్తున్నారు. 
 
ఈ తెల్లవారు జామున సామాన్య ప్రజలెవరూ రోడ్ల మీద కనపించలేదు. అత్యవసర కార్యక్రమాల నిమిత్తం బయటికి వెళ్లే వారు తప్ప సాధారణ రోజుల్లో ఉండే జన సంచారం లేదు. రోడ్ల మీద వచ్చిన వారికి పోలీసులు అడ్డగిస్తున్నారు. వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారు. విస్తృతంగా సోదాలను నిర్వహిస్తున్నారు.
 
అయోధ్యలోని అన్ని ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలకు బందోబస్తును కల్పించారు. అయోధ్యలోని ప్రఖ్యాత, అతి ప్రాచీనమైన హనుమాన్ గర్చి ఆలయానికి రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారమైనప్పటికీ.. రోజువారీ పూజలను నిర్వహించే అర్చకులు, ఇతర అతి కొద్దిమంది భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశాన్ని కల్పించారు. భక్తుల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. ప్రాత:కాల పూజలను నిర్వహించిన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. 
 
ఇప్పటికే అయోధ్యలో రెండు దశల్లో డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలను పరిశీలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇవే చర్యలను తీర్పు వెలువడిన తరువాత కూడా కొనసాగిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు