తీర్పు ఏదైనా సరే.... సమస్య పరిష్కారమే ముఖ్యం : ముస్లిం మతపెద్ద

గురువారం, 7 నవంబరు 2019 (15:16 IST)
దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వివాదాస్పద రామజన్మభూమి, అయోధ్య కేసులో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నప్పటికీ తమకు ఆమోదయోగ్యమేనని, ప్రముఖ ఇస్లామిక్‌ సంస్థ జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ ప్రకటించింది. వివాదాస్పద అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పును వెలువరించనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆ సంస్థ అధినేత మౌలానా సయీద్‌ అర్షద్‌ మదాని మీడియాతో మాట్లాడుతూ, ముస్లింలంతా కోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వివాదంపై గతంలో తాము మధ్యవర్తిత్వం వహించామని, అది విఫలమైందని గుర్తుచేశారు. ఈ వివాదం స్థలం గురించి మాత్రమే కాదని సుప్రీంకోర్టు న్యాయవిధానానికి ఓ పరీక్ష అని వ్యాఖ్యానించారు. 
 
న్యాయస్థానం నమ్మకం, విశ్వాసాలను బట్టి కాకుండా ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు సైతం దీనిని స్థలవివాదంగా మాత్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. తుది తీర్పు వచ్చేవరకు వివాదాస్పద కట్టడం షరియా చట్టం ప్రకారం మసీదుగానే ఉంటుందని చెప్పారు.
 
ఎలాంటి ప్రార్థనా మందిరాలను లేదా నిర్మాణాలను కూల్చకుండానే బాబ్రీ మసీదును కట్టినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం ఈ నిర్మాణాన్ని ఇతరులకు అప్పగించడానికి ఏ వ్యక్తికిగానీ, సంస్థకుగానీ అధికారాలు లేవని స్పష్టం చేశారు. 'ఏది ఏమైనా ఈ దేశం మనది, చట్టాలు మనవి, సుప్రీంకోర్టు మనది. కాబట్టి తీర్పు ఎలా ఉన్నా మేము గౌరవిస్తాం' అని ఆయన ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు