జూన్ నెలాఖరు వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులపై నిషేధం

శుక్రవారం, 28 మే 2021 (18:16 IST)
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని జూన్ నెలాఖరు వరకు పొడగించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి అన్ని షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. 
 
'26-06-2020 నాటి సర్క్యులర్‌లో సవరణలు చేయడం జరిగింది. షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులకు సంబంధించి విధించిన నిషేధాజ్ఞలు 2021, జూన్ 30వ తేదీన అర్థరాత్రి 23:59 గంటల వరకు కొనసాగుతాయి' అని డిజిసిఎ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అయితే, ఈ నిషేధాజ్ఞలు అంతర్జాతీయ కార్గో సర్వీసులకు మాత్రం వర్తించవని స్పష్టం చేశారు. అయితే, ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల్లో భాగంగా పలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు మాత్రం అనుమతించారు. 
 
దీనికి సంబంధించి పలు దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, యూకె, యుఎఇ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌ సహా 27 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాలను చేసుకుంది. ఈ ఒప్పందం చేసుకున్న దేశాల మధ్య కరోనా భద్రతల మధ్య విమానాలు నడుస్తున్నాయి. స్వదేశీ విమాన సర్వీసులు మాత్రం యథావిధిగా నడుస్తాయి. 


 

pic.twitter.com/IueesZFoiV

— DGCA (@DGCAIndia) May 28, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు