భారత రక్షణ రంగంలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రస్థావరాలను ఏర్పాటుచేసి భారత్‌లో విధ్వంసం సృష్టించాలని నిత్యం కుట్రలు పన్నుతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పీచమణిచేందుకు వీలుగా భారత సైన్యం చేతికి మరో అత్యాధునిక హెలికాఫ్టర్ వచ్చి చేరింది. ఈ అత్యాధునిక అపాచీ హెలికాఫ్టర్ పేరు ఏహెచ్-64 అటాక్. ఈ హెలికాప్టర్లు భారత వైమానికదళం(ఐఏఎఫ్)లో చేరాయి.
ఇందులోభాగంగా, మొదట విడతగా 8 హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ భారత్‌కు అప్పగించింది. ఈ అత్యాధునిక హెలికాప్టర్లను అమెరికా వాయుసేన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతోంది. ఇద్దరు పైలెట్లు నడిపే ఈ అపాచి హెలికాప్టర్‌ను రాత్రిపూట నడిపేందుకు నైట్ విజన్ సౌకర్యం ఉంది. అలాగే శత్రువులను లక్ష్యంగా చేసుకునేందుకు 30 ఎంఎం ఎం230 చైన్‌గన్‌ను అమర్చారు. ఈ హెలికాప్టర్ల ద్వారా ఏజీఎం 114, హైడ్రా 70 మిస్సైళ్లను ప్రయోగించవచ్చు.
ప్రస్తుతం అమెరికాతో పాటు జపాన్, ఇజ్రాయెల్, సింగపూర్, యూఏఈ ఈ హెలికాప్టర్‌ను వాడుతున్నాయి. ఒక్కో హెలికాఫ్టర్ ధర రూ.256.43 కోట్లు కావడం గమనార్హం. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అపాచి హెలికాప్టర్లు గరిష్టంగా 500 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తాయి.