ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా బదిలీ చేశారు. అదీకూడా అవమానకరరీతిలో బదిలీ చేశారు. ఈ బదిలీ చేసిన విధానంపై కేంద్రం గుర్రుగా ఉంది. అసలు బదిలీకి గల కారణాలను నిఘా వర్గాల ద్వారా సేకరించించినట్టు సమాచారం. అదేసమయంలో ఎల్వీ కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న తలంపులో ఉన్నట్టు సమాచారం.
మరోవైపు ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై మాట్లాడిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందంటూ విమర్శించారు. ఏపీ సర్కారు రాజ్యాంగ సంక్షోభం దిశగా నడుస్తోందని.. కేంద్రం అన్నీ గమనిస్తోందంటూ హెచ్చరించారు.
మరోవైపు ఆయన సేవలను వాడుకోవాలని భావిస్తున్న కేంద్రం.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. కాగా సీవీసీగా ప్రస్తుతం కేవీ చౌదరి ఉండగా.. ఆ పదవిలో ఆయన ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. మరి కేంద్ర సర్వీసులకు వెళితే ఎల్వీకి ఎలాంటి పదవిని కట్టబెడుతారో వేచిచూడాల్సిందే.