మోడీ మహాకుట్ర.. పవన్ ఆమరణ దీక్ష... ఆ తర్వాత ప్రత్యేక హోదా : నేతలతో చంద్రబాబు

శుక్రవారం, 16 మార్చి 2018 (11:20 IST)
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర స్థాయిలో మహాకుట్ర జరిగినట్టు తనకు స్పష్టమైన సంకేతాలు అందాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యంగా, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. 
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై మాటల దాడిచేయడం, వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం వంటి తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాలన్నింటిపై చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. 
 
కానీ, అది వైకాపా, జనసేన చేసిన నిరసనలు, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే ఇస్తున్నట్టు ప్రజలను మభ్య పుచ్చాలన్నది మోడీ ఆలోచనగా ఉంది. హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించడాన్ని గుర్తు చేసిన ఆయన, పవన్ దీక్ష తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేశారు. 
 
ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని చంద్రబాబు ఆరోపించారు.  కేంద్రం కుట్రలు, ఆడుతున్న డ్రామాలపై ప్రజల్లోకి వెళతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇంకన్నా రుజువులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు