విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలిసింది.. ఇస్రో ఛైర్మన్

ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (14:29 IST)
చంద్రుడు అన్వేషణ నిమిత్తం చంద్రమండలంపైకి చంద్రయాన్-2 మిషన్‌తో పంపిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలిసిందని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ ఎక్కడుందో తాము కనుగొన్నామని చెప్పారు. 
 
ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ విక్రమ్‌కు సంబంధించిన ఫొటోలు(థర్మల్ ఇమేజ్‌లు) తీసిందని వెల్లడించారు. ల్యాండర్‌ను యాక్టివేట్ చేసేందుకు, సంకేతాలు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఇంతవరకూ విక్రమ్ నుంచి తమకు ప్రతిస్పందన రాలేదని వివరించారు. 
 
త్వరలోనే ల్యాండర్, ఇస్రో భూంకేంద్రం మధ్య సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్బిటర్, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లను పంపింది. 
 
అయితే శనివారం తెల్లవారుజామున చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించిన ల్యాండర్ విక్రమ్.. జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు దిగగానే, ఒక్కసారిగా సంబంధాలు తెలిగిపోయిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు