ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. ఈ క్రంమలో ఫ్యాన్సీ నంబర్ల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతుంటాయి. తాజాగా దుబాయ్‌లో ఓ నంబర్ ధర సరికొత్త రికార్డును సృష్టించి, ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఖరీదైన కార్ల నంబర్ ప్లేట్లకు సంబంధించి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఓ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లమంది పేదలకు ఆహారం అందించే బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు 100 మిలియన్ ఏఈడీ (దిర్హామ్)లను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఎమిరేట్స్ ఆక్షన్ పేరుతో దీన్ని రూపొందించారు.
ఇందులో భాగంగా జుమైరాలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో వేలం కార్యక్రమం నిర్వహించారు. దీన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఇందులో "పీ7" నంబర్ ప్లేట్ కోసం ఎంతోమంది బిడ్డర్లు పోటీ పడ్డారు. చివరకు 55 మిలియన్ దిర్హామ్‌ల వద్ద ఓ వ్యక్తి ఈ నంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు.