ఎన్‌కౌంటర్‌ కింగ్.. శభాష్ సజ్జనార్... నాడు స్వప్నిక.. నేడు దిశ.. ప్రజలు కోరుకున్నట్టుగానే..

శుక్రవారం, 6 డిశెంబరు 2019 (09:43 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు శుక్రవారం వేకువజామున ఎన్‌కౌంటర్ చేశారు. కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నలుగురు నిందితులను హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే, ఆ నిందితులు తిరగబడి పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. 
 
ఫలితంగా దిశను పెట్రోల్ పోసి తగులబెట్టిన ప్రాంతంలోనే నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. అయితే, నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీకే సజ్జనార్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈయన గతంలో పలు కేసుల్లో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో ఆయనకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు ఉంది. ఫలితంగా ఇపుడు సీపీ సజ్జనార్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. సజ్జనార్ ఎంతో మంచి పని చేశారంటూ వేలాది ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
దిశ కేసును దర్యాఫ్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి సజ్జనార్ స్వయంగా నేతృత్వం వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో గతంలో ఆయన వరంగల్ ఎస్పీగా పని చేస్తున్న వేళ జరిగిన మరో ఎన్‌కౌంటర్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
 
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ... 2008, డిసెంబర్ 10న వరంగల్‌లో స్వప్నిక అనే యువతిపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న స్పప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతలపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్‌‌తో దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేయగా, జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
 
ఆపై ముగ్గురు నిందితులూ పోలీసుల నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఆ సమయంలో వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. మానవ హక్కుల సంఘాలు ఆ ఎన్ కౌంటర్ బూటకమని గగ్గోలు పెట్టినా, ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్లకు భూమిపై బతికే అర్హత లేదని, నాటి సీఎం వైఎస్ నుంచి అందిన ఆదేశాలతోనే సజ్జనార్ ఎన్‌కౌంటర్‌కు అనుమతి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
 
ఇక గత వారం జరిగిన దిశ హత్యాచారం, దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆసేతు హిమాచలం నిరసనలతో అట్టుడికింది. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో దిశను హత్య చేసిన చోట సీన్ రీకన్‌‌స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను విచారిస్తున్న వేళ, వారంతా పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నాడు స్వప్నిక, నేడు దిశ... ఈ రెండు ఘటనల్లోనూ సజ్జనార్‌దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.
 
అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంను ఎన్‌కౌంటర్ చేయడంలోనూ సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో సజ్జనార్ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఐజీగా ఉన్నారు. నయీంను హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. నయీం ఎన్‌కౌంటర్‌తో అనేక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలను నిర్వహించిన సజ్జనార్.. పలువురు మావోయిస్టు అగ్రనేతలను అరెస్టు లేదా ఎన్‌కౌంటర్ చేయడంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు