ఏది నిజం.. ఏది అబద్ధం : డిసెంబర్ 1 నుంచి మళ్లీ లాక్డౌన్

శుక్రవారం, 13 నవంబరు 2020 (08:21 IST)
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ లాక్డౌన్ అమలు చేసింది. ఇది మార్చి మూడో వారం నుంచి రెండు నెలల పాటు కఠినంగా కొనసాగింది. ఆ తర్వాత దశలవారీగా ఈ లాక్డౌన్‌ను సడలిస్తూ వచ్చింది. అయినప్పటికీ దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్దగా తగ్గలేదు. ఇప్పటికీ రోజుకు 45 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, డిసెంబరు ఒకటో తేదీ నుంచి మళ్లీ లాక్డౌన్ అమలు చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయివుంది. ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. 
 
అయినప్పటికీ.. ఈ వార్తలపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) దీనిపై స్పందించింది. ప్రముఖ మీడియా సంస్థ పేరుతో మార్ఫింగ్‌ చేసిన ఒక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని, అయితే లాక్డౌన్‌ పెట్టే ఆలోచన ఇప్పటి వరకు ప్రభుత్వానికి లేదని పీఐబీ స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు