మహారాష్ట్ర నాసిక్ జిల్లాకు చెందిన ఓ ఉల్లిరైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. నాలుగు నెలల పాటు కష్టపడి పండించిన ఉల్లికి తగిన గిట్టుబాటు ధర లేదని ఆగ్రహించిన రైతు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపత్తు నిర్వహణ శాఖకు పంటను విక్రయించగా వచ్చిన డబ్బును విరాళంగా పంపించి తన నిరసనను తెలిపాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
నాసిక్ జిల్లాలోని నిప్‌హాద్ వాసి సంజయ్ సాఠె అనే రైతు నాలుగు నెలలు శ్రమించి 750 కిలోల ఉల్లి పండించాడు. కిలోకు ఒక రూపాయి మాత్రమే లభించడంతో ఆగ్రహించాడు. చివరకు పలు రకాలుగా బేరమాడి కిలోకు రూ.1.40కు విక్రయించారు. తద్వారా వచ్చిన రూ.1,064ను ప్రధాని మోడీకి విరాళం పంపించాడు.
దీనిపై సంజయ్ మాట్లాడుతూ, నాలుగు నెలలు కష్టపడి 750 కిలోల ఉల్లి పండించా. నిప్‌హద్ టోకు మార్కెట్లో కిలోకు ఒక రూపాయి మాత్రమే ఇస్తానన్నారు. బేరమాడి దానిని రూ.1.40కు పెంచాను. మొత్తంగా రూ.1,064 అందుకున్నాను. నా కష్టానికి తగిన ప్రతిఫలం చూసి బాధేసింది. అందుకే నిరసనగా ప్రధాని విపత్తు నిర్వహణ శాఖకు ఆ మొత్తం పంపించాను. మనియార్డర్ చేసేందుకు అదనంగా రూ.54 ఖర్చుచేశాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మా కష్టాలపై సానుభూతి లేని ప్రభుత్వంపై కోపంతో ఇలా చేశా’ అని వెల్లడించాడు.