పిచ్చిపిచ్చి రాతలు రాసి విలన్‌గా చిత్రీకరించారు : మీడియాపై గవర్నర్ ఫైర్

గురువారం, 26 ఏప్రియల్ 2018 (10:10 IST)
మీడియాపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మండిపడ్డారు. తన గురించి పిచ్చిపిచ్చి రాతలు రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో తనను విలన్‌ను చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
నిజానికి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేకాకుండా, రాష్ట్ర విడిపోయిన తర్వాత అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. అంటే ఆయన ఇప్పటికే గవర్నర్‌గా 11 సంవత్సరాలపాటు సేవలందించారు. ఆయన పదవీకాలాన్ని ఇక పొడిగించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈనేపథ్యంలో మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నరసింహన్ వెంటనే హైదరాబాద్‌కు తిరిగిరావడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నరసింహన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆయన సెటైర్లు వేశారు.
 
తనపై ఇష్టం వచ్చినట్టు రాస్తూ, విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారని మీడియాను ఉద్దేశించి నరసింహన్ అన్నారు. 35 పేజీల నివేదికను కేంద్రానికి ఇచ్చినట్టు గతంలో రాశారని నిష్టూరమాడారు. ఇప్పటికే ఎంతోకాలం గవర్నర్‌గా పని చేశానని... ఎవరైనా ఎంతకాలం పదవిలో ఉంటారు? అని ప్రశ్నించారు. 
 
తాను వెళ్లిపోయిన తర్వాత... తనంత మంచి గవర్నర్ లేడనే విషయాన్ని కూడా మీరే రాస్తారని చెప్పారు. తాను దేవాలయాలకు వెళ్లినా తప్పే అన్నట్టు వార్తలు రాస్తారని... పదవిలోకి రాకముందు కూడా దేవాలయాలకు వెళ్లడం తన అలవాటని... పదవి ముగిసిన తర్వాత కూడా తాను దేవాలయాలకు వెళతానని గవర్నర్ నరసింహన్ చురకలంటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు