కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ట్రయల్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంది అంటూ వ్యాఖ్యానించారు.
ఈ తాత్కాలిక బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ, ఇది తాత్కాలిక బడ్జెట్ కేవలం ట్రైలరే అని, ఎన్నికల తర్వాత ఇండియా కొత్త అభివృద్ధి పుంతలు తొక్కించే దిశగా ఇది తీసుకెళ్తుందన్నారు. మధ్యతరగతి నుంచి కూలీల వరకు, రైతుల అభివృద్ధి నుంచి వ్యాపారుల వృద్ధి వరకు, తయారీ రంగం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వరకు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి నవ భారత్ నిర్మాణం వరకు ఈ తాత్కాలిక బడ్జెట్‌లో అన్నీ ఉన్నాయి అని మోడీ ప్రశంసల వర్షం కురిపంచారు.
దేశ అభివృద్ధికి పన్ను చెల్లిస్తున్న సామాన్యులే కారణమని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన అన్నారు. మధ్య, ఉన్నత తరగతి వర్గాలు నిజాయతీతో పన్నులు చెల్లించడం వల్లే కొత్త పథకాలు ప్రవేశపెట్టగలిగామని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ప్రధాని చెప్పారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదని, తమ ప్రభుత్వం ఆ ఆకాంక్షను నెరవేర్చిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంచేశారు.