కేరళ సీరియల్ ఉమెన్ కిల్లర్ : చలాకీ మాటలతో మభ్యపెట్టి మట్టుబెట్టింది...

గురువారం, 10 అక్టోబరు 2019 (12:59 IST)
కేరళ సీరియల్ ఉమెన్ కిల్లర్ జాలీ కథ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 14 యేళ్లలో ఆరుగురిని హత్య చేసిన ఈ మహిళ పైకి చలాకీగా నవ్వుతూ, మాయమాటలతో మభ్యబెట్టి మట్టుబెట్టినట్టు తేలింది. ఆమె గురించి ఆసక్తికరమైన వరుస కథనాలు వస్తున్నాయి. 
 
ఈ సైకో ఉమెన్ కిల్లర్‌పై కేసును విచారిస్తున్న డీజీపీ లోక్‌నాథ్ బెహరా మాట్లాడుతూ, జాలీ... పైకి చలాకీగా నవ్వుతూ కనిపిస్తూ, అందరితోనూ చక్కగా మాట్లాడేదని చెప్పారు. మంచి గృహిణిగా పేరు తెచ్చుకుందని తెలిపారు.
 
అయితే, ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమేనని, మరో వైపు చూస్తే, 14 ఏళ్లలో ఆరుగురిని హత్య చేసిందని తెలిపారు. జాలీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నామని, ఒక్కో సమయంలో సైకోగా మారే ఆమె, తినే ఆహారంలో సైనైడ్ కలుపుతూ ఒక్కొక్కరినీ మట్టుబెట్టిందన్నారు. 
 
అందుకే ఆమెకు సైకో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించనున్నామని లోక్‌నాథ్ తెలిపారు. ఈ కేసు పోలీసులకు చాలా సంక్లిష్టమైనదని, విచారణకు మంచి సైకాలజిస్టుల సాయం తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. 
 
అయితే, జాలీ బంధువులు మాత్రం, ఆమె అమాయకురాలని చెబుతుండటం గమనార్హం. ఆమెను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాలీ స్నేహితులు కూడా ఆమె వరుస హత్యలు చేసిందంటే నమ్మలేకున్నామని చెప్పడం ఇపుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. తన భర్త మరిదిపై మోజుపడిన జాలీ... భర్తతో పాటు.. మొత్తం ఆరుగుని హతమార్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు