డ్యాన్స్ బార్లలో మందు - చిందు ఉండొచ్చు... కానీ.. : సుప్రీం కీలక తీర్పు

గురువారం, 17 జనవరి 2019 (13:52 IST)
మహారాష్ట్రలోని డ్యాన్స్ బార్ల యజమానులకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన అన్ని రకాల కఠిన నింబంధనలను తోసిపుచ్చింది. అదేసమయంలో బార్లలో నృత్యాలు చేసే అమ్మాయిలకు టిప్స్ ఇవ్వొచ్చు కానీ, వారిపై డబ్బులు మాత్రం వెదజల్లకూడదని పేర్కొంది. 
 
మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు 2016లో ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం మేరకు బార్లలో మద్యం సరఫరా చేయరాదనీ, సీసీ టీవీ కెమెరాలు అమర్చాలనీ, బార్లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలని, ప్రార్థనామందిరాలు, విద్యాలయాలకు కిలోమీటరు దూరంలో బార్లను ఏర్పాటు చేయాలని ఇలా అనేక నిబంధనలు విధించింది. వీటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర బార్ల యజమానుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు... డ్యాన్స్ బార్లపై అక్కడి ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను కొట్టేసింది. బార్లలో మందు, చిందు కలిసి నడవచ్చని స్పష్టంచేసింది. రాష్ట్రంలోని డ్యాన్స్ బార్లు ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ముంబై వంటి మహానగరాల్లో ఇది కుదరదని, దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. 
 
బార్ల‌లో సీసీటీవీలు ఖచ్చితంగా ఉండాల‌న్న ప్ర‌భుత్వ నిబంధ‌న‌ను కూడా కోర్టు కొట్టివేసింది. అయితే, బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్స్ ఇవ్వాలి తప్ప.. వాళ్లపై డబ్బు వెదజల్లకూడదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు బార్ రూమ్స్, డ్యాన్స్ ఫ్లోర్ మధ్య గోడ ఉండాలన్న నిబంధనను కూడా సుప్రీం తోసిపుచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు