మహారాష్ట్ర - హర్యానాల్లో కాషాయం రెపరెపలు.. కనిపించని హస్తవాసి

గురువారం, 24 అక్టోబరు 2019 (08:59 IST)
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలా బీజేపీ దూసుకెళ్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ అధికారం నిలబెట్టుకునే దిశగా ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. తొలి రౌండ్‌ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి కాంగ్రెస్‌ కూటమిపై ఆధిక్యంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ పక్షాలు 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కూటమి 47 చోట్ల, ఇతరులు 14 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
ఇకపోతే, హర్యానాలో బీజేపీ కూటమి 52 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 11 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. హర్యానాలో జేజేపీ గణనీయంగా ఓట్లు చీల్చినా కాంగ్రెస్‌కు ఊరట లభించలేదు. జాట్‌ ఓట్లు గట్టెక్కిస్తాయన్న కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. హర్యానాలో మోదీ జాతీయవాద ప్రచారం బీజేపీకి లాభించినట్టు కనిపిస్తోంది.
 
288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్ర శాసనసభకు 98 సీట్లున్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీతోపాటు.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికలు, ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెల్సిందే. వీటి ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు