మంగళగిరి నాయక్... మీకు హ్యాట్సాఫ్

గురువారం, 15 జులై 2021 (15:40 IST)
అనాధ బాలబాలికల జీవితాల్లో ఓ చిన్న ఆర్టీసీ ఉద్యోగి వెలుగులు నింపుతున్నాడు. తల్లిదండ్రుల‌కు దూర‌మైన పిల్ల‌ల‌కు బాస‌ట‌గా నిలుస్తున్నాడు. మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో డీజీ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. నాయక్ తన ఉద్యోగం బాధ్యతలను నిర్వహిస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, ఒక పౌరునిగా ఓ మంచి పని చేయాలని సంక‌ల్పించారు.

2007లో నవులూరులో పది మంది అనాధ బాల బాలికలతో అద్దె ఇంటిలో అనాధ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అలా 14 ఏళ్ళగా అనాధ బాలబాలికలకు సేవలందిస్తున్నారు. 2018లో షైన్ పౌండేషన్ ఏర్పాటు చేసి, చినకాకానిలో షైన్ ఆనంద శరణాలయం నిర్మాణం జరిపారు. ఈ శరణాలయం నేడు 60 మంది అనాధ బాల బాలికలకు నీడనిస్తోంది. 
 
నాయక్ ఉద్యోగంలో తాను రిటైర్ అయ్యేనాటికి వచ్చే పిఎఫ్‌ను ముందుగానే తీసుకొని, దానితోపాటు బ్యాంకులో కొన్ని పర్సనల్ లోన్లు కలిపి 30 లక్షలు పోగుచేశారు. దాతల సహకారంతో సేకరించిన మరో 70 లక్షలతో కలిపి కోటి రూపాయల వ్యయంతో మూడు అంతస్తుల‌తో షైన్ ఆనంద శరణాలయం భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో హాలుగాను, మొదటి అంతస్తులో బాలురకు, రెండవ అంతస్తులో బాలికలు ఉండేలా నిర్మాణం జరిపారు. దీంతో శరణాలయం భవనం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతూ పసిహృదయాల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతోంది.
 
ఈ ఆనంద శరణాలయం ఇపుడు పూర్తిగా దాతల సహకారంతోనే నడుస్తోంది. దాతలు శరణాలయంలో పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకొని బాలబాలికలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడతోపాటు, కీర్తిశేషులైన పెద్దల పేరు మీద కూడా  సేవా కార్యక్రమాలు  చేస్తుంటారు.

కొంతమంది దాతలు శరణాలయానికి బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు పంపిణీ చేస్తారు. బాలబాలికలకు విద్యతోపాటు దైవభక్తి, దేశభక్తిని పెంపొందిస్తూ సాంస్కృతిక, యోగ వంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తున్నారు. శరణాలయంలోని పిల్లలు రాష్ట్ర స్థాయి వివిధ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను సాటి ప్రశంస పత్రాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
 
నేడు కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎంతో ప్రయాస పడుతున్న ఈ రోజుల్లో... నాయక్ ఎంతోమంది అనాధ బాల బాలికలకు నీడ క‌ల్పించ‌డం నిజంగా హ్యాట్సాఫ్ క‌దా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు