'బఫర్ జోన్లు'గా కరోనా ప్రభావిత ప్రాంతాలు.. నెల పాటు నిర్బంధం?!

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (08:51 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. దీంతో లాక్‌డౌన్‌‌ను మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. 
 
ముఖ్యంగా, కరోనా వైరస్ కేసులు బయటపడిన ప్రాంతాల్లో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా కేంద్రం ఓ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా, కరోనా ప్రభావిత ప్రాంతాలను బఫర్ జోన్లుగా ప్రకటించి, ఆ ప్రాంతాలను నెల రోజుల పాటు నిర్బంధించాలని భావిస్తున్నారు. 
 
ఈ బఫర్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలకు చెందిన ప్రజలు బయటకు రావడం కానీ, అక్కడకు వెళ్లడం కానీ ఉండదు. కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరినీ ఐసొలేషన్‌కు తరలిస్తారు. టెస్టుల్లో రెండు సార్లు నెగెటివ్ వస్తేనే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తారు. తక్కువ లక్షణాలు ఉన్నవారిని స్టేడియంలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్స్‌లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఒక స్థాయిలో లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులకు, తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉన్నవారిని అత్యున్నత సదుపాయాలు ఉన్న ఆసుపత్రులకు తరించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. 
 
అలాగే, కరోనా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలను మూసివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాచరణలో ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థను పూర్తిగా బంద్ చేస్తారు. కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. 
 
క్వారంటైన్ జోన్‌లో కనీసం నాలుగు వారాల పాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే... ఆ ప్రాంతంలో క్వారంటైన్ ప్లాన్‌ను సడలిస్తారు. ముఖ్యంగా హాట్ స్పాట్ ఏరియాల్లో కొత్త క్వారంటైన్ ప్లాన్‌ ను కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు కేంద్రం పంపించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు