ట్రాఫిక్ పోలీసుల బాదుడు, గురుగ్రాం ద్విచక్రవాహనదారుడికి రూ. 23,000 జరిమానా, కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చేమో?

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (16:39 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటార్ వాహన చట్టంపైన కొంతమంది మంచిపని చేశారంటుంటూ మరికొందరు మాత్రం మండిపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు సవరించి భారీగా వడ్డనలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏదో మధ్యతరగతి జీవులం... జరిమానాలు తమకు అందుబాటులో కూడా వుండటంలేదనీ, పొరబాటున దొరికితే జేబులకు చిల్లులు పడుతున్నాయని అంటున్నారు. మోటారు సైకిళ్లను వదిలేసి సైకిళ్లు వేసుకుని వెళ్లడం మంచిదని అంటున్నారు.
 
ఇకపోతే కొత్త మోటారు వాహనాల చట్టం 2019 సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధించి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కరోజులోనే 5 వేల మంది వాహనదారులకు చలానాలు విధించినట్లు నోయిడా ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. 
 
సోమవారం వినాయక చవితి పండుగ హడావుడిలో జనం వున్నారు. ఐతే ట్రాఫిక్ పోలీసులు మాత్రం కొత్త చట్టం రావడంతో ఆ నిబంధనలు తాలూకు ఘాటు ఎలా వుంటుందో చూపించారు. గురుగ్రాంలో ఓ వ్యక్తి స్కూటరుపై వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపారు. అతడు ఏకంగా 5 నిబంధనలు ఉల్లంఘించాడు. 
అందులో...
 
1. డ్రైవింగ్ లైసెన్స్ లేదు.. ఇందుకు రూ. 5000
2. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు... ఇందుకు రూ. 5000
3. ఇన్సూరెన్స్ లేదు... ఇందుకు ---- రూ. 2000
4. హెల్మెట్ ధరించలేదు... ఇందుకు ---- రూ. 1000
5. ఎయిర్ పొల్యూషన్ స్టాండర్డ్స్ పట్టించుకోలేదు.. ఇందుకు- రూ. 10,000
మొత్తం - రూ. 23,000 జరిమానా విధించారు.
 
ఢిల్లీలోనూ ఇదేరీతిలో జరిమానాల బాదుడు వున్నట్లు చెపుతున్నారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు కొత్త చట్టం తెచ్చిన కొత్త ఉత్సాహంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. మరి ఇకనైనా నిబంధనలు పాటిస్తారో లేదంటే జనం తమతమ కార్లు, మోటారు సైకిళ్లను వదిలేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా సైకిళ్లు వినియోగిస్తారో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు