ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెరపైకి వచ్చిన దగ్గర్నుంచి ఆయన గురించి చర్చ విపరీతంగా జరుగుతోంది. తాజాగా ఓ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావుతో ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ... తన సీఎం పీఠాన్ని లాక్కున్నదే కాకుండా తన బ్యాంకు ఖాతాను కూడా లాక్కోవడంతో, ఆ బాధతో ఎన్టీఆర్ ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకూ ఏడ్చి ఏడ్చి బాధతో చనిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే... " ఎన్టీఆర్‌కి జాతకాల పిచ్చి... నాయకులు చెప్పింది వినరు... ఆ జాతకాల పిచ్చితోనే అన్నీ పోగొట్టుకున్నారు. ఆయన పదీభ్రష్టుడవడంలో ఎవ్వరి హస్తం లేదు. ఎన్టీఆర్ చాలా అహంకారి, దురహంకారి. పదవి పోవడంతో దాన్ని తట్టుకోలేక ఆయనకు పక్షవాతం వచ్చింది.
ఇంతమంది పిల్లలున్నా పట్టించుకోలేదు. ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించిందో నాకు తెలియదు. ఐతే మంచానపడ్డ ఎన్టీఆర్‌కు సపర్యలు చేసిందామె. ఈమెను ఇష్టపడి దగ్గరిపెట్టుకున్నాడు. భార్య చనిపోయిందని పెళ్లి చేసుకున్నాడు. అందులో తప్పేముంది. ఐతే కుటుంబం అంతా వ్యతిరేకం, లక్ష్మీపార్వతికి. భార్య చనిపోయిన దగ్గర్నుంచి ఆయన ఒంటరి అయ్యారు. దాంతో లక్ష్మీపార్వతిని చేరదీశారు.
ఎన్టీఆర్‌ను దెబ్బ కొట్టింది చంద్రబాబు ఒక్కరే కాదు... మరొకరు కూడా కలిసి దెబ్బ కొట్టారు. ఎన్టీఆర్ సీఎం కాగానే మరింత అహంకారం పెరిగింది. దాంతో ఆయనపై ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత మొదలైంది. అది కాస్తా ఆయన పదవి పోవడానికి కారణమైంది. సీఎం సీటునే కాదు... బ్యాంకు ఖాతాను కూడా లాక్కున్నారు చంద్రబాబు. దాంతో సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకూ ఏడ్చి ఏడ్చి చనిపోయారు.