తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం దెబ్బకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు పారిపోతోంది. ఈ అవిశ్వాస గండం నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే, తెరాస ఎంపీలతో సభలో రభస చేయిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయిస్తోంది. దీంతో సభ ఆర్డర్‌లో లేదని పేర్కొంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తున్నారు. గత శుక్రవారం నుంచి సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
మంగళవారం కూడా కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చను చేపట్టే పరిస్థితి కనిపించలేదు. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. సభను కొనసాగనివ్వాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరినప్పటికీ వారు శాంతించలేదు. దీంతో పార్లమెంట్ ఉభయసభలు బుధవారానికి వాయిదాపడ్డాయి.
దీనిపై కాంగ్రెస్ మండిపడింది. షేమ్.. షేమ్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. సభ ఆర్డర్‌లో లేదని చర్చలు జరపకుండా వాయిదాలు వేసుకుంటూ పోతోందని, సభ ఆర్డర్‌లో లేకపోవడానికి కేంద్రమే కారణమని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈనెల 5 నుండి ప్రారంభమైన పార్లమెంట్ సభలు సమర్థవంతమైన చర్చలు జరగకుండా వాయిదాలు పడుతున్నాయని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉందన్నారు. నాలుగేళ్లయినా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, విపక్షాలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడంలేదని అజాద్ విమర్శించారు. అవిశ్వాసంతో పాటు ప్రత్యేక హోదా అంశాల చర్చకు రాకుండా కేంద్రమే అడ్డుకుంటోందని ఆరోపించారు.