ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ భయం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ క్రమంలో ఇపుడు కరోనా కొత్త రూపంలో కాటేస్తోంది. అదే కరోనా స్ట్రెయిన్. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం బ్రిటన్ ఇప్పటికే వణికిపోతోంది. ఈ వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ఏకంగా లాక్డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో కొత్త స్ట్రెయిన్‌పై కేంద్రం తాజాగా ఓ ప్రకటన చేసింది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్‌లో లేదని స్పష్టం చేసింది. పైగా, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని తేల్చి చెప్పింది.
మంగళవారం జరిగిన పత్రికా సమావేశంలో నీతీ అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ ఇదే అంశంపై స్పందిస్తూ, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌కు కూడా వీకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కరోనాలోని జన్యుమార్పులు, వ్యాధి తీవ్రతపై అవి చూపే ప్రభావం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మార్పుల వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని, అయితే వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పూ లేదని, కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ రాజేష్ భూషన్ తెలిపారు.