ముగిసిన రంజన్ గొగోయ్ పదవీకాలం.. నేడు సీజేఐగా బాబ్డే

సోమవారం, 18 నవంబరు 2019 (09:24 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎస్ఏ.బాబ్డే సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 
 
కాగా, పదవీ విరమణ చేసిన రంజన్ గొగోయ్... ఈశానయ్ రాష్ట్రాల నుంచి వచ్చిన తొలి సీజేఐగా రికార్డు సృష్టించారు. ఈయన శుక్రవారం తన చివరి పనిదినం పూర్తిచేసుకొన్నారు. అసోంలోని దిబ్రూగఢ్‌లో 1954 నవంబర్‌ 18న కేశబ్‌చంద్ర గొగోయ్‌, శాంతిప్రియ దంపతులకు జన్మించిన రంజన్‌.. ఢిల్లీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకుని, 1978లో బార్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేరారు. 
 
గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ, 2001లో అదే హైకోర్టులో శాశ్వత జస్టిస్‌గా నియమితులయ్యారు. 2010 లో పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బదిలీపై వెళ్లిన రంజన్‌.. మరుసటి ఏడాది హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 2012 ఏప్రిల్‌ 23న సుప్రీంకోర్టు జస్టిస్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌ 3న సీజేఐగా పదోన్నతి పొంది 13 నెలలు కొనసాగారు.
 
కాగా, సీజేఐగా రంజన్‌ గొగోయ్‌ పలు చారిత్రక తీర్పులు వెలువరించారు. సుదీర్ఘకాలం కొనసాగిన అయోధ్య వివాదానికి ముగింపు పలికిన ధర్మాసనానికి నేతృత్వం వహించారు. శబరిమల ఆలయం కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించిన బెంచ్‌కూ ఆయనే చీఫ్‌గా ఉన్నా రు. రాఫెల్‌ విమానాల కొనుగోలు విషయం లో కేంద్రానికి క్లీన్‌చిట్‌ ఇచ్చి.. ప్రధాని మోడని చోర్‌ అంటూ సంభోదించిన కేసులో రాహుల్‌ గాంధీని హెచ్చరించి వదిలేయడం, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి సీజేఐ కార్యాలయం వస్తుందని.. ఇలా వరుసగా పలు వివాదాస్పద కేసులపై తీర్పులిచ్చారు. 
 
గతేడాది జనవరిలో నాటి చీఫ్‌ జస్టిస్‌ పనితీరును ప్రశ్నిస్తూ మీడియా ముందుకొచ్చిన నలుగురు సీనియర్‌ జస్టిస్‌ల్లో ఒకరిగా ఉన్న రంజన్‌ గొగోయ్‌ చరిత్రలో నిలిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు. కాంగ్రెస్‌లో కొనసాగిన రంజన్‌ తండ్రి కేశబ్‌చంద్ర గొగోయ్‌ 1982లో రెండు నెలలు అసోం సీఎంగా పని చేశారు.
 
కాగా, ఆయన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో మొదటివరుసలో నిలిచేవారిలో స్వతంత్రంగా వ్యవహరించే న్యాయమూర్తులు, నిజాలను నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టులు ఉంటారన్నారు. ‘సామాన్యులకు సేవలందించడంలో న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాలి’ అని స్పష్టంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు