మోడీని కాదు బీజేపీ విధానాన్ని ఓడించాలి : యశ్వంత్ సిన్హా
శనివారం, 19 జనవరి 2019 (13:39 IST)
కోల్‌కతాలోని బ్రిగేడ్ మైదానం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల నేతలు ఏకమయ్యారు. ఇందులో మోడీ వ్యతిరేకులుగా ముద్రపడిన బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా ఉన్నారు.
ఇందులో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కర్నే వ్యతిరేకించేందుకు ఈ సభను ఏర్పాటు చేయలేదని, మొత్తం బీజేపీ విధానాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న ఐడియాలజీకి తాము వ్యతిరేకమన్నారు.
'సబ్‌కా సాత్ సబ్ కా వికాస్' అన్నారు, కానీ ఆ నినాదంలో వికాశం లేదని, కేవలం వినాశనమే ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్నారు. గణాంకాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు.
ఆ తర్వాత లోక్‌తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశంలో తీవ్రమైన సంక్షోభం ఉందన్నారు. రైతులు తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 7 కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయారని గుర్తుచేశారు.
దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ తన గుప్పిట పట్టుకుందనీ, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గంగలో నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. మరో రాజకీయ విప్లవానికి కోల్‌కతా నాంది పలికిందన్నారు. బీజేపీ అవినీతికి రాఫెల్ కుంభకోణం ఒక నిదర్శనం అని శరద్ యాదవ్ దుయ్యబట్టారు.