హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరేందుకు అనేక మంది రాజకీయ నేతలు పోటీపడుతున్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లారావు. ఈయనపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
పుల్లారావును పార్టీలో చేరేందుకు కష్టపడి ఒప్పించినట్టు చెప్పారు. ఆయన్ను జనసేన పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన రాస్తున్న కథనాలు విశ్లేషణాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయన్నారు.
ఓసారి తాను పుల్లారావును కలుసుకున్నాననీ, తామిద్దరం కొన్ని గంటల పాటు ఒకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నట్టు తెలిపారు. జనసేన వంటి కొత్త పార్టీకి పుల్లారావు వంటి అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వం అవసరముందన్నారు. జనసేనలో చేరాల్సిందిగా తాను పుల్లారావును ఒప్పించాననీ, ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే, జనసేన విధానాలపై పుల్లారావు రాసిన ఓ వార్తా కథనం క్లిప్‌ను ట్వీట్‌కు జతచేశారు.