అన్ని స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధం : పవన్ కళ్యాణ్

శుక్రవారం, 18 మే 2018 (08:37 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలోని 175 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దించుతుందనీ, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు.
 
ఆయన మాట్లాడుతూ, ఉద్యమాలకు పుట్టినిల్లయిన శ్రీకాకుళం నుంచే తన పోరాట యాత్ర ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. తాను చేపట్టేది బస్సు యాత్ర కాదని, ప్రజా పోరాట యాత్రని స్పష్టం చేశారు. యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో 45 రోజుల పాటు నడుస్తుందన్నారు. మున్ముందు పాదయాత్ర కూడా చేస్తానని వెల్లడించారు. 
 
దేశంలో ఎక్కడకు వెళ్లినా ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లినవారే కనిపిస్తున్నారని, ఇప్పటికీ ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఉందని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరోసారి విడిపోతుందని, ప్రాంతాల మధ్య వైషమ్యాలు, ద్వేషాలు పెరిగిపోతాయని హెచ్చరించారు. వీటిని నిలువరించి, అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందించడానికే జనసేన 20వ తేదీ నుంచి పోరాట యాత్ర ప్రారంభిస్తోందన్నారు.
 
 యాత్ర సందర్భంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో యువత, విద్యార్థులతో కలిసి 'నిరసన కవాతు' నిర్వహిస్తామని ప్రకటించారు. 20న ఇచ్ఛాపురంలో తొలుత అమరవీరులకు నివాళులు అర్పించి, తర్వాత గంగమ్మకు పూజలు చేసి యాత్ర ప్రారంభిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయమని తేల్చిచెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు