పవన్ కల్యాణ్ కోసం జనం వస్తున్నారా? జనసేన పార్టీ కోసం వస్తున్నారా?

మంగళవారం, 16 అక్టోబరు 2018 (13:35 IST)
జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన క‌వాతు పేరుతో ఇచ్చిన పిలుపుకు యువ‌త నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. క‌వాతుకు జ‌న‌సేన శ్రేణులు, యువ‌త, అభిమానులు భారీ స్ధాయిలో త‌ర‌లివ‌చ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విజ్జేశ్వరం మీదుగా పవన్ కళ్యాణ్ పిచ్చుకలంక చేరుకుని..ఆత‌ర్వాత కవాతు ప్రారంభించారు. పిచ్చుకలంక నుంచి కాటన్‌ విగ్రహం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు... గంటన్నర సేపు కవాతు నిర్వహించారు. 
 
జనసేన ఆధ్వర్యంలో లక్షలాది మంది జనసైనికులతో కవాతు నిర్వహించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడును నిశిత విమర్శలతో నిలదీశారు. పంచాయతీలకు ఎన్నికలు పెట్టకుండా.. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని.. గూండాల రాజ్యం తెస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు పాచిన లడ్డూలను వేడి చేసుకుని ఆరగించి, ఇప్పుడు హోదా పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. వ్యవస్థల మీద మీకు గౌరవం లేకపోతే.. మీ సీఎం, మంత్రి పదవుల్ని వదిలేసి.. చీఫ్ సెక్రటరీకి, అధికార్లకు పాలన అప్పగించండి.. అంటూ రాజమండ్రి సభలో చంద్రబాబునాయుడు, లోకేష్‌లను పవన్ కల్యాణ్ నిలదీశారు.
 
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ‘‘తూర్పుగోదావరిలో ఇంత ప్రేమ ఉంటుందని, నేను కలలో కూడా ఊహించలేదు. ముందుగా ఇన్ని వ్యయప్రయాసలకు లోనై ఇన్ని లక్షలాది మంది జనం జనసేన పార్టీ కవాతుకు వేల గ్రామాల నుంచి ఇక్కడకు వచ్చిన అన్నదమ్ములకు, ఆడపడచులు, అక్కచెల్లెళ్లకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. 
 
ముందుగా తల్లి గోదావరి ప్రవాహంలో జాలువారే తెల్లని ముత్యాలు నా తెలుగింటి ఆడపడుచులు అక్కాచెల్లెళ్లు. గోదావరి తీరంలో లోలోపల ఉన్న దేవతలను చాలా సున్నితంగా స్పృశించే నా ఆడపడచులు సూర్యభగవానుని లేలేత కిరణాల్లాంటి వారు. నా తెలుగుజాతి ఆడపడచులు అక్కచెల్లెళ్లు... మదమెక్కిన మహిషాల్లాంటి మానవ పోతుల్ని తెగనరికే దుర్గాదేవి ప్రతీకలు. మానవ మృగాలను ఛేదించే తల్లి పార్వతి శూలాలు నా అక్కచెల్లెళ్లు. అలాంటి వారికి నిండుగా జనసేన తరఫున మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. 
 
లక్షలాదిగా తరలివచ్చిన నా జనసైనికులు కారుమబ్బుల్లో పరుగెత్తే పిడుగులు. అవినీతి వ్యవస్థను ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమసింహాలు నా జనసైనికులు. నా జనసైనికులు తల్లి భారతమాతకు ముద్దుబిడ్డలు. 
 
ఈ కవాతు ముఖ్యోద్దేశం గురించి నిన్న చెప్పాను. కవాతు ఎప్పుడు చేస్తాం.. ఎవరు చేస్తారు? కవాతు మిలిటరీ సైనికులు చేస్తారు.. సామాన్యులు చేయరు. సామాన్య ప్రజలు చేయరు. జనసేన జనసైనికులు ఇపుడు వర్తమాన భారత ప్రజాస్వామ్యంలో ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇవాళ రాజకీయాల్లో నిండిపోయి ఉన్న అవినీతిని చీల్చి చెండాడడానికి  మనం ఈ కవాతు చేస్తున్నాం. 
 
నేను అభిమానించే కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పారు.. ‘‘సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం.. మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఇంకెన్ని తుపాకులు దూరం.. ’’ అని. ఆయన ఎందుకీ పదం వాడారు? ఆ సంగతిని మనం గమనించాల్సి ఉంది. ఇవాళ ఇన్ని లక్షల మంది జనసైనికులు ఇక్కడకు వస్తున్నారంటే.. పవన్ కల్యాణ్ కోసం జనం వస్తున్నారా? జనసేన పార్టీ కోసం వస్తున్నారా? అంతే అనడానికి లేదు. సగటు రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయి ఉండగా.. రగిలిపోతున్న యువత ఈరోజు అవినీతి ప్రక్షాళన చేయడానికి ముందుకు వస్తున్నారు. 
 
సగటు ప్రజాస్వామ్య వ్యవస్థ, బ్యూరోక్రసీ విభాగాలను ఇవాళ్టి రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం చేసేస్తున్నది. సగటు ప్రజల నుంచి సామాన్యుల్లోంచి ఆడపడచుల్లోంచి విప్లవం రావాలి. వారికి బుద్ధి చెప్పాలి. అందుకే, ఈ రోజుల్లో అవినీతితో, పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనప్పుడు.. ఈ కవాతు చేస్తున్నాం మనం. యుద్ధం చేస్తున్నాం మనం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు