ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో, ఆ సంస్థ సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా.. హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ పాండే.. గాంధీజీ గడ్డిబొమ్మపై తుపాకీతో కాల్పులు జరిపారు. అక్కడున్నవారంతా 'మహాత్మా నాథూరాం గాడ్సే అమర్ రహే' అంటూ నినాదాలతో హోరెత్తించారు. గాంధీజీ గడ్డిబొమ్మను దహనం చేశారు.
అనంతరం పూజా విలేకరులతో మాట్లాడారు. "గాంధీజీ హత్య ఘటనను పునఃసృష్టించడం ద్వారా మేమొక కొత్త సంప్రదాయానికి నాందిపలికాం. ఏటా దసరా రోజున రావణాసురుడి బొమ్మను దహనం చేసినట్టు.. ఇకముందూ ఇది కొనసాగుతుంది" అని చెప్పారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సే హిందూ మహాసభ సభ్యుడే. గాడ్సే గౌరవార్థం ఆ సంస్థ ఏటా జనవరి 30ని 'శౌర్యదివస్'గా పాటిస్తోంది.
మరోవైపు, సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూపీ పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో 12 మంది హిందూమహాసభ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ గడ్డిబొమ్మ దహనం కేసులో నలుగురిని గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని అలీఘడ్ ఏఎస్పీ నీరజ్ జడాన్ చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని ఏఎస్పీ పేర్కొన్నారు.