అమృతలాంటి ఆడపిల్లా వద్దూ.. మారుతి రావులాంటి తండ్రినీ ఇవ్వకు సామి...

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:35 IST)
తెలుగు రాష్ట్రాల్లో గతకొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన అంశం మిర్యాలగూడలో ప్రణయ్ హత్య. టీవీ ఛానళ్లలో, వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. కులోన్మాదంతో ముడిపడి పరువు హత్యగా తెర పైకొచ్చిన ప్రణయ్ హత్య కేసు వ్యవహారంలో మరో ఆందోళనకర విషయమేంటంటే... హత్యకు గురైన ప్రణయ్‌కు, అతని భార్య అమృతకు సోషల్ మీడియా సాక్షిగా ఎంతమంది మద్దతు తెలుపుతున్నారో... అదేవిధంగా మారుతీరావు చేసిన పనిని సమర్థిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఇక్కడ ఆందోళనకలిగించే అంశం.
 
'జై మారుతీరావు.. జై మారుతీ సేన' అంటూ కొందరు ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే... మరో అడుగు ముందుకేసి మారుతీ రావు ఫొటోను తమ ప్రొఫైల్ పిక్‌గా మార్చేస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారైతే మిర్యాలగూడలో మారుతిరావుకు మద్దతు ర్యాలీ కూడా నిర్వహించారు. ఇలా మారుతిరావుపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ తమకుతోచిన విధంగా మద్దతు తెలుపుతున్నారు. 
 
'నాకు పెళ్లైతే ముందు ఆడపిల్ల పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటా కానీ అమృతలాంటి ఆడపిల్లని మాత్రం ఇవ్వకు స్వామి'.
, '9వ తరగతిలోనే ప్రేమా.. ఆ వయసు ప్రేమించడానికి తగినదేనా.. అది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ.. అమృత విషయంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?'.
.. ఇలాంటివి కొన్నిపోస్టులు. మరో పోస్ట్‌లో మారుతీరావు విషయంలో అమృత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కొందరు ఆమె తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన తండ్రిని ఉరితీయాలంటూ అమృత వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
అలా మారుతీరావు మద్దతుదారుడు ఒకరు చేసిన పోస్ట్ ఇది..
 'అవును. నీ తండ్రిని ఉరి తీయాల్సిందే. నీలాంటి కూతురిని కనడమే ఆయన చేసిన పెద్ద తప్పు. అందుకు చంపాల్సిందే. నీ తండ్రిని నువ్వు ఎన్ని సంవత్సరాలుగా మానసికక్షోభకు గురిచేశావో నీకు తెలుస్తుందా? అమృత చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమెకేదో పెద్ద ఎజెండానే ఉన్నట్టుంది'.
 
ఇలా చాలామంది అమృతను తప్పుబడుతూ.. మారుతీరావును సమర్థిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కులోన్మాదం ఎంతలా వేళ్లూరుకుపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు