తుపాకీ గురిపెట్టి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : సంజయ్ రౌత్

సోమవారం, 25 నవంబరు 2019 (14:22 IST)
మహారాష్ట్రలో బీజేపీ సర్కారు ఏర్పాటునకు చేపట్టిన ఆపరేషన్ కమల్‌పై శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. తుపాకీ నీడలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, సీబీఐ, ఈడీ, ఐటీ, పోలీసు శాఖలకు చెందిన నలుగురు అధికారులతో తుపాకీ గురిపెట్టి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందని ఆయన ఆరోపించారు. 
 
మహారాష్ట్రలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ, బీజేపీ నాలుగు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులతో శాసనసభ్యులకు గురి చూపించి చేపట్టిన ఆపరేషన్ కమల్ వల్ల శాసనసభలో బలనిరూపణకు మెజారిటీ లభిస్తుందా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 
 
గురుగాం నగరంలోని హోటల్ కేంద్రంగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ పన్నిన ఆపరేషన్ కమల్ వ్యూహం వికటించిందని, ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తిరిగి వచ్చారన్నారు. బీజేపీ బెదిరించి ఎమ్మెల్యేల మద్దతు పొందాలని చూసిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. 
 
శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైన తరుణంలో బీజేపీ‍‌ని సర్కారు ఏర్పాటుకు గవర్నరు ఆహ్వానించడం ఏమిటని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలవల్లే ప్రజాస్వామ్యంపై సామాన్య ప్రజలకు నమ్మకం పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు