'మేం ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నాం. ఇద్దరు వ్యక్తులు ముకేశ్ అంబానీ ఇల్లు అంటిల్లాకు బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ డ్రైవర్ మా దర్యాప్తులో చెప్పాడు' అని ముంబై పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అంబానీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు సమీక్షిస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి ప్రస్తుతం అంబానీ ఇంటి వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
నిజానికి గత ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీ నివాసానికి భారీ భద్రత ముప్పు ఏర్పడింది. ఆయన నివాసానికి కొద్ది దూరంలో పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో దొరికింది. ఆ వాహనంలో 20 జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. అంతేకాదు.. ముకేశ్, ఆయన సతీమణి నీతా అంబానీలకు రాసిన లేఖ కూడా దొరికింది. కానీ అందులో వివరాలు వెల్లడి కాలేదు. సదరు కారును ఎవరో దొంగిలించారని తేలింది. అటుపై కొన్ని రోజులకు సదరు కారు యజమాని హత్యకు గురయ్యారు. దీంతో నాటి నుంచి ముకేశ్ అంబానీ అంటిల్లా వద్ద భద్రత పటిష్టం చేశారు.
ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. బయటపడని ఈ కుట్రకు, ఒక పోలీస్ అధికారికి లింక్‌లు ఉన్నాయని సందేహాలు ఉన్నాయి. కారు యజమాని మాన్‌సుఖ్ హైరెన్ హత్య తర్వాత.. ఆయనతో లింక్‌లు ఉన్న పోలీసు అధికారి సచిన్ వాజె ఇప్పటికీ సస్పెన్షన్‌లోనే ఉన్నారు.