వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకత్వానికి వైఎస్ షర్మిల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన షర్మిల ప్రస్తుతం కడపలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య అంశంపై ఆమె పదేపదే జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారు.
ఈ విషయంపై మాట్లాడిన షర్మిల.. వివేకానందరెడ్డి హత్య అంశంపై తీర్పు చెప్పాలని కడప ఓటర్లను అభ్యర్థించడంతో భావోద్వేగానికి గురయ్యారు. హత్యకేసులో న్యాయమైన తీర్పు కోసం పోరాడుతున్న తనకు హంతకులను మద్దతివ్వవద్దని కడప ఓటర్లను ఆమె భావోద్వేగంతో వేడుకున్నారు. ఆమె తన చీర కొంగు చాచి అడుగుతున్నాను. తనకు న్యాయం చేయండి అని ఓటర్లను వేడుకున్నారు.
ఓటర్లకు షర్మిల ఉద్వేగభరితంగా అభ్యర్ధించిన మరుసటి రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు, షర్మిల మేనత్త వైఎస్ విమలమ్మ షర్మిలపై విరుచుకుపడ్డారు. షర్మిల, సునీత తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ వివేకానందరెడ్డిని అసలు హంతకులతో జతకట్టి జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. షర్మిల, సునీతలను వైఎస్ కుటుంబంలో కానీ, సామాన్య ప్రజల్లో కానీ పట్టించుకునే వారు లేరని, ఈ డ్రామాలు ఆపాలని, వెంటనే ప్రజలు వారి నోరు మూయించాలని ఆమె కోరారు.
వైఎస్ కుటుంబానికి చెందిన బద్ధ ప్రత్యర్థులు షర్మిలను చుట్టుముట్టారని, వాళ్ల మాటలకు షర్మిల ఆడుతోందని విమలమ్మ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక నుంచి షర్మిల, సునీతలకు వెన్నుదన్నుగా నిలిచే ఉద్దేశం వైఎస్ కుటుంబంలో ఎవరికీ లేదని ఆమె పేర్కొన్నారు.